ఏపీలో డిజిటల్ విప్లవం: రూ. 2,432 కోట్లతో ప్రతి గ్రామానికి హై-స్పీడ్ ఇంటర్నెట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల గ్రామాల వరకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే లక్ష్యంతో..
By - అంజి |
ఏపీలో డిజిటల్ విప్లవం: రూ. 2,432 కోట్లతో ప్రతి గ్రామానికి హై-స్పీడ్ ఇంటర్నెట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల గ్రామాల వరకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే లక్ష్యంతో 'సవరించిన భారత్ నెట్' ప్రాజెక్టుపై ఆదివారం కీలక ఒప్పందం జరిగింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. డిజిటల్ భారత్ నిధి అడ్మినిస్ట్రేటర్ శ్యామల్ మిశ్రా, రాష్ట్ర మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2,432 కోట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,426 గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బాండ్ కనెక్టివిటీని అందించడం లక్ష్యం. ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి 'ఆంధ్రప్రదేశ్ భారత్ నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్' అనే ప్రత్యేక సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ప్రాజెక్టు పరిధి:
మొదటి దశ: ఇప్పటికే ఉన్న 1,692 పంచాయతీలలో నెట్‌వర్క్ అప్‌గ్రేడేషన్.
రెండవ దశ: 11,254 గ్రామాలకు కనెక్టివిటీ పూర్తి చేయడం.
కొత్త పంచాయతీలు: కొత్తగా ఏర్పడిన 480 గ్రామ పంచాయతీలకు సేవలను విస్తరించడం.
చివరి మైలు కనెక్టివిటీ: 3,942 గ్రామాల్లో నేరుగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియపై దృష్టి సారించడం.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. 1990ల కాలంలోనే తాను బీఎస్ఎన్ఎల్ (BSNL) ద్వారా అధిక బ్యాండ్‌విడ్త్ కోసం, టెలికాం సంస్కరణల కోసం పోరాడానని గుర్తు చేసుకున్నారు. గతంలో విద్యుత్ స్తంభాల ద్వారా కేబుల్స్ వేసి 9.78 లక్షల ఫైబర్ కనెక్షన్లు ఇచ్చామని, అయితే కాలక్రమేణా ఆ సంఖ్య తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కేంద్ర సహకారంతో రాబోయే 18 నెలల్లో ప్రతి ఇంటికీ హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ విద్య, టెలిమెడిసిన్, ఏఐ (AI) ఆధారిత సేవలు, సుపరిపాలన కోసం డిజిటల్ కనెక్టివిటీ అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
భారత్ నెట్ అనేది టెక్నాలజీని సామాన్యుడికి చేరువ చేసే చారిత్రాత్మక ప్రయత్నమని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కొనియాడారు. భారతదేశం కేవలం 22 నెలల్లోనే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5G రోల్ అవుట్ పూర్తి చేసిందని, ప్రస్తుతం దేశంలో 40 కోట్ల మంది 5G వినియోగదారులు ఉన్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మార్పు తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్‌ను ఒక రోల్ మోడల్‌గా నిలిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు.