ఉద్యోగుల పెన్‌డౌన్ ప్రారంభం
AP Secretariat Employees Pen Down begins.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పీఆర్‌సీ జీవోలను రద్దు చేయాలని కోరుతూ
By తోట వంశీ కుమార్ Published on 4 Feb 2022 2:46 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పీఆర్‌సీ జీవోలను రద్దు చేయాలని కోరుతూ పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసనలు తెలుపున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నిన్న పీఆర్‌సీ సాధన సమితి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి తరలివచ్చారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ.. మారు వేషాల్లో ఉద్యోగులు వచ్చారు. చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడంతో ఉద్యోగులు మరింత ఉత్సాహంగా ముందుకువెలుతున్నారు.
ఈనేపథ్యంలో రేపటి(శనివారం) నుంచి సహాయ నిరాకరణ చేపడుతామని ప్రకటించారు. అయితే.. రేపు సెలవు దినం కావడంతో ఒక రోజు ముందుగానే సచివాలయంలో పెన్‌డౌన్‌ను నిర్వహించారు. అదే విధంగా యాప్ డౌన్ చేసి ఉద్యోగులు నిరసన తెలిపారు. అలాగే ఉద్యోగులు సచివాలయంలో ఉన్న అన్ని బ్లాకుల్లో తిరుగుతూ ప్రభుత్వానికి, కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదిలా ఉంటే.. చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ కావడంపై పీఆర్‌సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. చలో విజయవాడ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, ఇతర రాజకీయ పార్టీల వారు ఎవరూ పాల్గొనలేన్నారు. ఈ విషయంలో అవాస్తవాలు ప్రచారం చేయొద్దని కోరారు. ఉద్యోగుల మేలు కోసం ఎవరూ మద్దతు ఇచ్చినా మంచిదేనని అన్నారు. ఉద్యోగులు స్వచ్చందంగా తరలిరావడంతో చలో విజయవాడ విజయవంతమైందన్నారు. విజయవాడ చరిత్రలోనే ఇలాంటి ఉద్యమం ఎప్పుడూ చూడలేదన్నారు. కొందరు వ్యక్తులు ఉద్యోగుల పట్ల ప్రజల్లో వ్యతిరేక బావన తెచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నిన్నటి ఆందోళనపై ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇక సీఎస్ సమీర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చిస్తామన్నారు.