ఏపీ స‌చివాల‌యంలో క‌రోనా క‌ల‌క‌లం.. మ‌రో ఉద్యోగి మృతి

AP Secretariat employee died with covid-19.ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌చివాల‌యంలో క‌రోనా బారిన ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 April 2021 8:47 AM GMT
AP secretariat

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌చివాల‌య ఉద్యోగుల్లో క‌రోనా సెకండ్ వేవ్ భ‌యం నెలకొంది. స‌చివాల‌యంలో క‌రోనా బారిన ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. 60 మందికి పైగా ఉద్యోగులు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. వారి కుటుంబ స‌భ్యుల‌కు కూడా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే ఆర్ధిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న వి.పద్మా రావు కరోనాతో మృతి చెంద‌గా.. తాజాగా మ‌రో ఉద్యోగి ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. జీఏడీలో సెక్షన్ ఆఫీసరుగా పని చేస్తున్న జి.రవికాంత్ ఆదివారం ఉద‌యం కరోనాతో మృతి చెందారు. రెండు రోజుల్లో ఇద్దరు ఉద్యోగులు క‌రోనాతో ప్రాణాలు కోల్పోవ‌డంతో స‌చివాల‌యం ఉద్యోగుల్లో భ‌యాందోళ‌న నెల‌కొంది. కొవిడ్ సెకండ్ వేవ్ ఉద్దృతి కార‌ణంగా మ‌రోసారి వ‌ర్క్ ఫ్రం హోం ఇవ్వాల్సిందిగా ఉద్యోగులు ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

కాగా..ఏపీలో గ‌డిచిన‌ 24 గంటల్లో 35,907ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 7,224 కేసులు నిర్ధ‌రాణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన‌ పాజ‌టివ్ కేసుల సంఖ్య 9,55,455కు చేరింది. అత్య‌ధికంగా చిత్తూరు జిల్లాలో 1051 కేసులు న‌మోదు కాగా.. అత్య‌ల్పంగా ప‌శ్చిమ గోదావ‌రిలో 96 కేసులు న‌మోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే చిత్తూరు జిల్లాలో న‌లుగురు, నెల్లూరు జిల్లాలో ము‌గ్గురు చొప్పున, క‌ర్నూల్‌, విశాఖ జిల్లాల్లో ఇద్ద‌రు చొప్పున‌.. గుంటూరు, కడప, కృష్ణా, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,388కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,332 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 9,07,598 కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 40,469 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,56,42,070 శాంపిల్స్ ను పరీక్షించారు.


Next Story