ఏపీలో ఆందోళనను విరమించిన రేషన్ డీలర్లు

AP Ration dealers call off strike.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ డీలర్లు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించారు.

By M.S.R  Published on  28 Oct 2021 9:30 AM GMT
ఏపీలో ఆందోళనను విరమించిన రేషన్ డీలర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ డీలర్లు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ధరల వ్యత్యాస సర్క్యులర్ ను అమలు చేయాలని, డీడీ నగదు వాపసు చేయాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వానికి గోనె సంచులను తిరిగిస్తే రూ. 20 చెల్లించాలనే జీవోను అమలు చేయాల్సిందేనని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొడాలి నాని రేషన్ డీలర్లతో చర్చలు జరిపారు. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని డీలర్లకు మంత్రి హామీ ఇచ్చారు. నవంబర్ నెలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ కోటాను సరఫరా చేస్తామని చెప్పారు. దీంతో డీలర్లు తమ ఆందోళనను విరమించారు.

వారి డిమాండ్లు:

రాష్ట్రవ్యాప్తంగా ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద నిరసన కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్‌ రేషన్‌ డీలర్ల సంఘం అంతకు ముందు పిలుపునిచ్చింది.. తాజా చర్చల వలన నిరసనలు విరమించారు. 2020 పీఎంజీకేవై కమీషన్‌ బకాయిలు తక్షణమే చెల్లించాలని రేషన్‌ డీలర్ల సంఘం డిమాండ్‌ చేసింది. డీడీ డబ్బు వాపసు, ధరల వ్యత్యాస సర్క్యులర్లను అమలు చేయాలని ప్రభుత్వాన్నికోరారు. డీలర్ల నుంచి ఐసీడీఎస్‌కు మళ్ళించిన కందిపప్పుకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని డీలర్లు కోరారు. గతేడాది మార్చి 29 నుంచి నేటి వరకు ఏపీ పౌరసరఫరాల కార్సొరేషన్‌ నుంచి డీలర్లకు రావాల్సిన కమీషన్‌ బకాయిలు చెల్లించాలన్నారు. గోనె సంచులను ప్రభుత్వానికి తిరిగిస్తే రూ.20 చొప్పున ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు చెల్లింపు చేయమని చెప్పడం సరికాదన్నారు. గోనె సంచులు తిరిగి ఇవ్వకుంటే ఎలాట్‌మెంట్‌ కట్‌ చేసి కేసులు పెడతామని హెచ్చరించడాన్ని తప్పుబడుతున్నారు. గోనె సంచులు ప్రభుత్వం తీసుకునేలా ఇచ్చిన జీవో 10ని పక్క రాష్ట్రం తెలంగాణలో అమలు చేస్తున్నారని డీలర్లు గుర్తుచేశారు. ఏపీలోనూ జీవో 10ని యథాతథంగా అమలు చేయాలని రేషన్‌ డీలర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story