ఏపీ పోలీస్ శాఖ మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రజలకు నాణ్యమైన భద్రత సేవలు అందించడంలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో తెలంగాణ పోలీస్ శాఖ, గుజరాత్ పోలీస్ శాఖ లు ఉన్నాయి. 2021 సంవత్సరానికి గాను స్కోచ్ సంస్థ పోలీస్ మరియు భద్రత విభాగంలో వివిధ రాష్ట్రాల్లో పౌరులకు అందిస్తున్న సేవలపై అధ్యయనం నిర్వహించి.. ఏపీ పోలీస్ శాఖ తొలి స్థానంలో ఉన్నట్లు గుర్తింపు నిచ్చింది. ఇలా ఏపీ పోలీస్ శాఖకు తొలి స్థానం దక్కడం ఇది వరుసగా రెండో ఏడాది.
స్కోచ్ సంస్థ రాష్ట్రంలోని వివిధ శాఖలకు సంబంధించిన సేవలకు గాను ప్రకటించిన 56 అవార్డుల్లో 23 అవార్డులను పోలీస్ శాఖ సొంతం చేసుకోవడం విశేషం. ఇందులో స్వర్ణంతో పాటు ఎనిమిది రజత పతకాలు ఉన్నాయి. పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ అంశాల్లో నూతనంగా, ఆధునిక విధానాలను ఆవిష్కరిస్తూ వాటిని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరే విధంగా అవలంభి పారదర్శకమైన, వేగవంతమైన సేవలను అందిస్తున్నందుకుగాను పోలీస్ శాఖ ఈ అవార్డులను అందుకుంది.
మహిళల భద్రత, నిర్ణీత సమయంలో చార్జ్ షీట్ల దాఖలు, పోలీస్ శాఖ పరిపాలనలో పూర్తి స్థాయి డిజిటైజ్ విధానం, క్లిష్టమైన కేసులను చేదించడం, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విభాగాలలో అవార్డులు వచ్చాయి.