ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై ప్రివిలేజ్ నోటీసు
AP Ministers Botsa Satyanarayana and Peddireddy issue privilege notice to SEC Nimmagadda Ramesh.ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఈసీ
By తోట వంశీ కుమార్ Published on 30 Jan 2021 3:13 PM GMT
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వం మధ్య యుద్ద వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు కొత్తరకాల ఎత్తులు వేస్తున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై ప్రభుత్వం కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు నిమ్మగడ్డపై సభా ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని కార్యాలయంలో ఈ నోటీసులు ఇచ్చారు. పరిధిని మించి ఎస్ఈసీ వ్యవహరిస్తున్నారంటూ తమ నోటీసుల్లో వారు పేర్కొన్నారు.
నిమ్మగడ్డపై రాష్ట్ర గవర్నర్ హరిచందన్ కు కూడా ఫిర్యాదు చేసే యోచనలో మంత్రులు ఉన్నారు. దీనికితోడు, ప్రవిలేజ్ కమిటీకి కూడా ఆయనపై ఫిర్యాదు చేసే అంశంపై ఆలోచన చేస్తున్నారు. ఏకగ్రీవాల గురించి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలను తప్పుపట్టిన ఎస్ఈసీ.. టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై మాట్లాడకపోవడం దారుణమని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ అమల్లోకి వచ్చినా మంత్రులు తమ పరిదిదాటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎస్‌ఈసీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ, సుప్రీంకోర్టు ఉల్లంఘన అని గవర్నర్‌కు ఇటీవల నిమ్మగడ్డ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.