కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదో తరగతితో పాటు ఇంటర్ పరీక్షలను రద్దు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతితో పాటు ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా.. రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను నిర్వహించి తీరుతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టం చేశారు. కరోనా ఉద్దృతి తగ్గాక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం లేదన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రద్దాంతం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.
రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్‌తో కలిసి పర్యావరణ దినోత్సవం సందర్భంగా సురేష్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ ముందుకు రావాలన్నారు.
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. 10,413 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 83 మంది మృత్యువాత పడ్డారు. 15,469 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,33.773 యాక్టివ్ కేసులు ఉన్నాయి.