'వారందరీపై పరువు నష్టం దావా వేస్తా'.. మంత్రి రోజా భావోద్వేగం
తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు సత్యనారాయణ తనపై ఆరోపించిన అవమానకరమైన వ్యాఖ్యలపై పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె రోజా విరుచుకుపడ్డారు.
By అంజి Published on 4 Oct 2023 9:00 AM IST'వారందరీపై పరువు నష్టం దావా వేస్తా'.. మంత్రి రోజా భావోద్వేగం
తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు సత్యనారాయణ తనపై ఆరోపించిన అవమానకరమైన వ్యాఖ్యలపై పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె రోజా విరుచుకుపడ్డారు. అటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలకు టీడీపీ హైకమాండ్ మద్దతు ఇవ్వడం పట్ల ఆమె నిరాశ వ్యక్తం చేశారు. మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తాను టీడీపీని వీడిన తర్వాత.. తనపై టీడీపీ క్యారెక్టర్ హత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ కంటతడి పెట్టారు. వారి కుటుంబ సభ్యులపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే టీడీపీ సభ్యులు సహిస్తారా అని ఆమె ప్రశ్నించారు.
సత్యనారాయణ అరెస్టును ఖండిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఎక్స్ పోస్ట్‌ను ఆమె అండర్లైన్ చేశారు. మహిళల పట్ల టీడీపీ వ్యవహరిస్తున్న తీరు ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన, అన్‌పార్లమెంటరీ భాషను ఉపయోగించిన వారందరిపైనా పరువు నష్టం దావా వేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ''మీరు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే అది ఫలించదు, నేను బతికి ఉన్నంత వరకు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, మా రాష్ట్ర మహిళలకు అండగా ఉంటాను'' అని రోజా అన్నారు.
‘అసభ్యకర చిత్రాల్లో నటించింది అంటూ టార్చర్ చేస్తున్నారు. అసెంబ్లీలో సీడీలను కూడా చూపించారు. కానీ ఎప్పుడూ నిరూపించలేదు. మహిళలు నచ్చినట్లు బతకమని సుప్రీంకోర్టే చెప్పింది. మీరెవరు నా క్యారెక్టర్ ను జడ్జ్ చేయడానికి. మహిళల్ని టీడీపీ ఆట వస్తువుల్లా చూస్తోంది’ అని రోజా భావోద్వేగానికి గురయ్యారు. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను తలచుకుని మంత్రి ఆర్కే రోజా కంటతడి పెట్టారు. ఆయన ఎంతో నీచంగా మాట్లాడారన్నారు. మీ ఇంట్లో మహిళల గురించి ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా? అని రోజా ప్రశ్నించారు. ఈ విషయాన్ని బండారు సత్యనారాయమూర్తి భార్య, కూతురిని అడుగుతున్నానని తెలిపారు.
మాజీమంత్రులు గంటా శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు, చివరికి నారా లోకేశ్ ఎందుకు స్పందించరు? మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఊరుకుంటారా? టీడీపీ ఓ సినిమా వ్యక్తి పెట్టిన పార్టీ. సినిమా వాళ్ళంటే లోకువా? మీ ఇంట్లో ఉన్న వారే ఆడవాళ్లా? వైసీపీలో ఉన్న వాళ్ళు కాదా? బండారు సత్యనారాయణ భార్య తన భర్తను చెప్పుతో కొట్టి ఉండాలి. సిగ్గు లేకుండా లోకేశ్ ట్వీట్ చేస్తున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను ఎందుకు ప్రచారానికి పిలిచారు? నేను చెడ్డదాన్ని అయితే ఎందుకు పార్టీలో పెట్టుకున్నారు? ఐరన్ లెగ్ అని నన్ను అవహేళన చేశారు” అని వాపోయారు మంత్రి రోజా.
మీ పార్టీలో ఉన్నప్పుడు తాను మంచిదాన్నని, వేరే పార్టీలో ఉన్నప్పుడు మాత్రం చెడ్డదానిని ఎలా అవుతానని ఆమె ప్రశ్నించారు. వైసీపీ లో ఉండే మహిళలకు కుటుంబాలు లేవా అని నిలదీశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని అన్నారు. ప్రశ్నిస్తే తన క్యారెక్టర్ పై దాడి చేస్తారా? అని అన్నారు. చంద్రబాబు ఆరెస్టు అయితే తమ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారని మంత్రి రోజా ధ్వజమెత్తారు. టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీ అని టీడీపీ తెలుగు దుశ్యాసన పార్టీగా మారిపోయిందన్నారు. టీడీపీలో మహిళలకు గౌరవం లేదని దుయ్యబట్టారు. మహిళలంటే వంటింటికే పరిమితమవ్వాలని, రాజకీయంగా ఎదుగుతుంటే టీడీపీ తట్టుకోలేదని రోజా మండిపడ్డారు. బండారు పై పరువునష్టం దావా వేస్తానని తెలిపారు.