AP: మంత్రి బుగ్గన బృందంపై తేనెటీగల దాడి.. 70 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తేనెటీగల దాడి నుంచి తప్పించుకున్నారు.

By అంజి  Published on  28 Jun 2023 3:46 PM IST
AP: మంత్రి బుగ్గన బృందంపై తేనెటీగల దాడి.. 70 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తేనెటీగల దాడి నుంచి తప్పించుకున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కనుమకింద కొట్టాలలో బుధవారం పలు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మంత్రి బుగ్గన గ్రామానికి వెళ్లారు. మంత్రి వెంట అధికారులు, అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఓ చెట్టు దగ్గర ఉండి పనులను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 70 మంది వరకు గాయాలు కాగా మంత్రి బుగ్గనను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. గాయపడ్డ వారిని సమీపంలోని బేతంచర్ల పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి బుగ్గన ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితుల్లో తీవ్రంగా గాయపడిన ఆరుగురికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి బుగ్గన వైద్యులకు సూచించారు.

కాగా స్వల్పంగా గాయపడ్డ వారిని వైద్యం అందించి ఇంటికి పంపించారు. ఇదిలా ఉంటే నిన్న నంద్యాల చెక్ పోస్టు వద్ద ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తూ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఓ మహిళ అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో ఆమె లేవలేని పరిస్దితుల్లో ఉంది. అదే సమయంలో అటుగా కాన్వాయ్ లో వెళ్తున్న ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆమెను గమనించారు. ఆర్ధికమంత్రి వెంటనే తన కాన్వాయ్ ని ఆపి సహాయక చర్యలు చేపట్టారు. మహిళకు ధైర్యం చెబుతూ అటు వైపు వస్తున్న వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాన్ని ఆపి సమీపంలోని ఆస్పత్రికి క్షతగాత్రురాలిని తరలించారు.

Next Story