తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పోలవరం ప్రాజెక్టుపై చేసిన కామెంట్లపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. డిజైన్ల ప్రకారమే పోలవరం ఎత్త పెంచారని, దీనిని ఎవరూ మార్చలేదని బొత్స చెప్పారు. భద్రాచలం ముంపు అనేది ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రస్తావించిన అంశమేనని గుర్తు చేశారు. విభజన చట్టం ప్రకారమే అంతా జరుగుతోందని అన్నారు. 100 ఏళ్ల తర్వాత గోదావరికి ఇంతలా వరదలు వచ్చాయని చెప్పారు. ముఖ్యమంత్రైనా, మంత్రులైనా బాధ్యతగానే మాట్లాడాలని హితవు పలికారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని, పువ్వాడ అజయ్ తన పని తాను చూసుకోవాలని మంత్రి బొత్స అన్నారు. ముంపు మండలాల బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. పువ్వాడ అజయ్ అనవసరపు విమర్శలు చేయడం మానుకోవాలని బొత్స సూచించారు. విలీన గ్రామాల ప్రజల కోసం ఏం చేయాలో తమకు తెలుసని బొత్స చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్ ఆదాయాన్ని ఏపీ కోల్పోయిందని, అలాగని హైదరాబాద్‌ను ఏపీలో కలిపేయమని అడగగలమా? అని తెలంగాణ మంత్రి పువ్వాడను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
తెలంగాణ మంత్రి పువ్వాడ ఏమన్నారంటే?
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించేందుకు కేంద్రం బాధ్యత తీసుకోవాలన్నారు. భద్రాచలం పక్కన ఉన్న 5 గ్రామాలను తామే ఆదుకున్నామని చెప్పారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి 5 గ్రామాలను.. తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వత శత్రువులు.. మిత్రులు ఉండరని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించారు.