ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 6.30కి మొదలైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఏర్పాట్లు చేయడంతో.. ఎన్నికలు ప్రశాంతంగా మొదలయ్యాయి. అయితే ఈ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి రోజు కో ట్విస్ట్ లు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా తొలివిడత పంచాయతీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవ్వడానికి ముందు.. ఓ సర్పంచ్ అభ్యర్ధి కిడ్నాప్ వ్యవహరం కలకలం రేపింది.
వడమాలపేట మండలం లక్ష్మమ్మ కండ్రిగ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మునిరాజును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు అతని మామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 6న మునిరాజు అదృశ్యమయ్యాడని ఎన్నికల్లో పోటీ చేయడంతో ప్రత్యర్ధులు కిడ్నాప్ చేసినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు.. అదృశ్యమైన మునిరాజు వడమాల పోలీస్ స్టేషన్ ఎదుట ప్రత్యక్షవటంతో పోలీసులు విచారించారు.
పోలింగ్ లో పాల్గొనకుండా ఉండేందుకు కిడ్నాప్ చేసి, బెదిరించారని మునిరాజు భార్య ఆరోపిస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన 3,249 గ్రామ పంచాయతీల్లో 525 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో నిలిపివేసిన ఏకగ్రీవాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సోమవారం సాయంత్రం తిరిగి అనుమతించారు.