నేటి నుంచే దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. పాస్‌లు ఇలా తీసుకోండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం 'దివ్యాంగ శక్తి' అనే సరికొత్త పథకాన్ని...
By - అంజి |
నేటి నుంచే దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. పాస్‌లు ఇలా తీసుకోండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం 'దివ్యాంగ శక్తి' అనే సరికొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అమరావతిలో బుధవారం ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించనుండగా, అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు దీనిని ప్రారంభించనున్నారు.
ఈ పథకం ప్రకారం, 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మరియు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన మొత్తం 7,264 బస్సులలో అంటే దాదాపు 73 శాతం బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా వెళ్ళవచ్చు. అంతేకాకుండా, తోడుగా వచ్చే సహాయకులకు (Attendants) టికెట్ ధరలో 50 శాతం రాయితీ కల్పించడం విశేషం.
గతంలో కేవలం నాలుగు రకాల వైకల్యాలకే పరిమితమైన ఈ ప్రయోజనాలను, ఇప్పుడు ప్రభుత్వం 21 రకాల వైకల్యాలకు విస్తరించింది. ఇందులో శారీరక, మానసిక వైకల్యాలతో పాటు ఆటిజం, పార్కిన్సన్స్ వ్యాధి, తలసేమియా, హీమోఫీలియా వంటి వ్యాధులు ఉన్నవారిని కూడా చేర్చారు. దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య 2.05 లక్షల నుండి దాదాపు 12.76 లక్షలకు పెరగనుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఏటా ₹207 కోట్ల అదనపు భారాన్ని భరించనుంది.
సాంకేతికతను జోడిస్తూ, ఫిజికల్ సర్టిఫికెట్లతో పని లేకుండా 'మన మిత్ర' వాట్సాప్ ప్లాట్‌ఫామ్ మరియు ఆర్టీసీ మొబైల్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ (QR Code) ఉన్న డిజిటల్ పాసులను జారీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 134 బస్టాండ్ కౌంటర్లలో కూడా ఈ సేవలు లభిస్తాయి. మహిళల కోసం అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం విజయవంతం కావడంతో, అదే స్ఫూర్తితో దివ్యాంగుల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.