ఏపీలోని పేదలకు భారీ శుభవార్త.. 6.50 లక్షల పీఎంఏవై ఇళ్లకు గ్రీన్ సిగ్నల్

గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస యోజన (PMAY) 2.0 కింద ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది.

By -  అంజి
Published on : 24 March 2026 7:11 AM IST

PMAY 2.0 Andhra Pradesh, Minister Parthasarathy, Rural Housing Scheme, LPG Shortage Solutions, Piped Gas Supply, Crop Loss Report AP, Farmers Compensation

ఏపీలోని పేదలకు భారీ శుభవార్త.. 6.50 లక్షల పీఎంఏవై ఇళ్లకు గ్రీన్ సిగ్నల్

గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస యోజన (PMAY) 2.0 కింద ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ప్రజల నుంచి అందిన సుమారు 10 లక్షల దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు వడపోసి, అందులో 6.50 లక్షల మందిని అర్హులుగా గుర్తించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ జాబితాను ఇప్పటికే కేంద్రానికి నివేదించామని, వచ్చే నెలలో దీనికి ఆమోదం లభించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఎంపికైన ప్రతి లబ్ధిదారునికి ఇంటి నిర్మాణానికి రూ. 2.39 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇక పట్టణాల్లో ఇళ్ల కోసం పేదలు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే వీలుందని తెలిపారు. కాగా ఇటీవలే పీఎంఏవై రూరల్‌ 2.O స్కీమ్‌ కింద మంజూరు చేసే ఇళ్ల ధరలను రూ.1.20 లక్షల నుంచి రూ.2.39 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో కేంద్రం వాటా రూ.72 వేలు, రాష్ట్ర వాటా రూ.48 వేలు ఉంటుంది. అదనంగా జీ రామ్‌ జీ కింద 90 పని దినాలకు కన్వర్జెన్స్‌ రూపంలో 27 వేలు, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద రూ.12 వేలు, ఎస్‌హెచ్‌సీ లోన్‌పై వడ్డీ రాయితీ రూ.80 వేలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది.

గ్యాస్ కొరతపై ఆందోళన వద్దు: ప్రత్యామ్నాయాలపై దృష్టి

ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఎల్‌పీజీ (LPG) సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ల కొరత తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇందులో భాగంగా ఇండక్షన్ స్టవ్‌ల వాడకం, పైప్డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. పైప్డ్ గ్యాస్ సరఫరాకు సంబంధించి 24 గంటల్లోనే అనుమతులు ఇచ్చేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని, ఇది సిలిండర్ గ్యాస్ కంటే తక్కువ ధరకే లభిస్తుందని ఆయన వివరించారు.

పంట నష్టంపై యుద్ధ ప్రాతిపదికన నివేదికలు

రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై మంత్రి ప్రాథమిక గణాంకాలను విడుదల చేశారు. సుమారు 9,981 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 1,381 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ నష్టంపై సమగ్ర నివేదికలను ఈ నెల 26వ తేదీ కల్లా రూపొందించి, 29 నాటికి రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. మార్చి 31వ తేదీ నాటికి కలెక్టర్లు తుది జాబితాను ప్రభుత్వానికి పంపాలని, తద్వారా రైతులకు త్వరితగతిన న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Next Story