నిమ్మగడ్డకు షాక్.. నామినేషన్లకు బ్రేక్
AP Highcourt stay on SEC orders. ఏపీలో మార్చి 10 నుంచి మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 3 March 2021 7:03 AM GMTఏపీలో మార్చి 10 నుంచి మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. గత మార్చిలో పురపాలక ఎన్నికల నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలపై వివిధ పార్టీల నుంచి ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. జిల్లా కలెక్టర్లు నివేదిక మేరకు తిరుపతి, పుంగనూరు, రాయచోటి, ఎర్రగుంట్ల లోని 4 వార్డులకు రీ నామినేషన్లకు ఎస్ఈసీ అవకాశం కల్పించింది. దీంతో నిన్న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు స్వీకరించారు. గురువారం మధ్యాహ్నాం 3గంటల వరకు ఉపసంహరణకు గడువుగా పేర్కొన్నారు. అయితే.. రీ నామినేషన్లను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎస్ఈసీ ఆదేశాలను కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగా నామినేషన్లకు అవకాశం ఇవ్వొద్దని ఆదేశించింది.
ఇక వాలంటీర్లపై కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది. వాలంటీర్ల నుంచి ఫోనులు స్వాధీనం చేసుకోకూడదని కోర్టు ఆదేశించింది. వార్డు వాలంటీర్లపై ఫిర్యాదు రావడంతో.. రాజకీయ కార్యకలాపాలకు వారు దూరంగా ఉండాలని.. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపైనే జరుగుతాయని.. స్వేచ్చాయుత ఎన్నికలకు వాలంటీర్లపై కఠిన చర్యలు అవసరం మనీ.. పథకాల పేరుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదని.. లబ్దిదారుల డేటా దృష్ట్యా వాలంటీర్ల పోన్లను నియంత్రించాలని అని ఎస్ఈసీ వాలంటీర్లపై ఆంక్షలు విధించింది. ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయ స్థానం వాలంటీర్లపై ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేసింది.