ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఓ వైపు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లలో మునిగిపోయిన సమయంలో పరిషత్ ఎన్నికలకు స్టే విధించింది హైకోర్టు. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు కావాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను పాటించలేదన్న సూచనలపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికలు ఆగిపోయాయి.
పరిషత్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ చేప్టట్టింది. జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలపై నాలుగు వారాల కోడ్ అమలు చేయలేదని హైకోర్టు పేర్కొంది. దీనిపై ఈనెల 15వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.