'గర్భాలయ పూజలకు నో ఎంట్రీ'.. అర్చకుల విదేశీయానంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
విదేశాలకు వెళ్లిన అర్చకులు దేవాలయాల ప్రధాన గర్భాలయాల్లోకి ప్రవేశించి పూజలు నిర్వహించడానికి వీల్లేదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు...
By - అంజి |
'గర్భాలయ పూజలకు నో ఎంట్రీ'.. అర్చకుల విదేశీయానంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
విదేశాలకు వెళ్లిన అర్చకులు దేవాలయాల ప్రధాన గర్భాలయాల్లోకి ప్రవేశించి పూజలు నిర్వహించడానికి వీల్లేదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్), శృంగేరి శారదా పీఠం గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మార్చి 30న ఉత్తర్వులు ఇచ్చారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి చెందిన శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారుడు డి.ఎస్.ఎస్.ఎస్. సుబ్రహ్మణ్యం సోమయాజి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనల ప్రకారం.. శాస్త్ర నిబంధనల ప్రకారం అర్చకులు విదేశీ పర్యటనలు చేయడానికి అనుమతి లేదు. ఒకవేళ ఎవరైనా అనివార్య కారణాల వల్ల విదేశాలకు వెళ్లి వస్తే, వారిని కేవలం ఆలయం వెలుపల జరిగే వ్రతాలు, పూజలకు మాత్రమే అనుమతించాలని, గర్భాలయంలోకి అనుమతించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. శృంగేరి శారదా పీఠం జగద్గురువులు భారతీతీర్థ స్వామి వారు విడుదల చేసిన 'ప్రామాణిక' ప్రకారం.. నిత్యం త్రికాల సంధ్యావందనం, మంత్ర జపం, వేద అధ్యయనం మరియు కఠినమైన ఆహార నియమాలు పాటించే వారే గర్భాలయ పూజలకు అర్హులు.
ముఖ్యంగా విదేశాలకు వెళ్లిన వారు, సంప్రదాయాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరించుకోవడం (Haircut) లేదా ముఖ క్షవరం (Shaving) చేసుకున్న వారు గర్భాలయంలో పూజలు చేయడానికి అనర్హులని పీఠం మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నిబంధనలను దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన దేవాదాయ శాఖ న్యాయవాది, కోర్టు ఆదేశాల మేరకు ధార్మిక పరిషత్ సర్క్యులర్ మరియు పీఠం ప్రామాణికాలను ఖచ్చితంగా అనుసరిస్తామని హామీ ఇచ్చారు.