వర్కింగ్ ఉమెన్స్‌కు ఏపీ సర్కార్ తీపి కబురు
సొంత ఊరు వదిలి, కెరీర్ కోసం పట్నం బాట పట్టిన మహిళలకి ఎదురయ్యే అతిపెద్ద సమస్య 'సురక్షితమైన వసతి'.
By - అంజి |
వర్కింగ్ ఉమెన్స్‌కు ఏపీ సర్కార్ తీపి కబురు
సొంత ఊరు వదిలి, కెరీర్ కోసం పట్నం బాట పట్టిన మహిళలకి ఎదురయ్యే అతిపెద్ద సమస్య 'సురక్షితమైన వసతి'. ప్రైవేట్ హాస్టళ్లలో భద్రత, నాణ్యమైన ఆహారం దొరకక ఇబ్బంది పడే మహిళా ఉద్యోగినుల కోసం ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో కొత్తగా 30 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేయబోతోంది. కేవలం ఉద్యోగం చేసే వారికే కాకుండా, పైచదువుల కోసం నగరాలకు వచ్చే విద్యార్థినులకు కూడా ఇక్కడ తక్కువ ధరకే వసతి, భోజన సదుపాయాలు లభించనున్నాయి.
ప్రైవేట్‌కు దీటుగా.. భద్రతకు ప్రాధాన్యత:
ఈ హాస్టళ్లు కేవలం గదులకే పరిమితం కావు. ఒక్కో నివాసంలో 30 మంది మహిళలకు ఆశ్రయం కల్పించనున్నారు. భద్రత విషయంలో రాజీ పడకుండా.. ప్రతి హాస్టల్‌కు ఒక మేనేజర్, వార్డెన్, ముగ్గురు కేర్ టేకర్లు, అలాగే రాత్రింబవళ్లు పహారా కాసే సెక్యూరిటీ గార్డులను నియమించనున్నారు. వీరి వేతనాల కోసం ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ. 10.08 లక్షల వరకు వెచ్చించనుంది.
తల్లులకు ఊరటనిచ్చే 'క్రెచ్' సౌకర్యం:
ఈ ప్రాజెక్టులో మరో హైలైట్ ఏమిటంటే.. ఉద్యోగినుల పిల్లల సంరక్షణ కోసం హాస్టల్ ఆవరణలోనే క్రెచ్ (శిశు సంరక్షణ కేంద్రం) ఏర్పాటు చేయడం. దీనివల్ల ఆఫీసులకు వెళ్లే తల్లులు తమ పిల్లల భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడంతో, త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.