ఏపీ సర్కార్ శుభవార్త.. నేడు 2.50 లక్షల మందికి ఇళ్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదల సొంతింటి కల నేడు నెరవేరబోతోంది. గత ఎనిమిదేళ్లుగా సాగుతున్న సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ...
By - అంజి |
ఏపీ సర్కార్ శుభవార్త.. నేడు 2.50 లక్షల మందికి ఇళ్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదల సొంతింటి కల నేడు నెరవేరబోతోంది. గత ఎనిమిదేళ్లుగా సాగుతున్న సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, కూటమి ప్రభుత్వం భారీ స్థాయిలో గృహప్రవేశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వహించే ఈ సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు ఇళ్లను అందజేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 2.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తున్నారు.
ఇందులో ఒక లక్ష టిడ్కో (TIDCO) గృహాలు ఉండగా, వివిధ కాలనీల్లో పూర్తయిన మరో 1.50 లక్షల సాధారణ గృహాలు ఉన్నాయి. 2017-19 మధ్య కాలంలోనే మెజారిటీ టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, గత ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనను నిర్లక్ష్యం చేయడంతో లబ్ధిదారులు ఇన్నేళ్లుగా ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు కేటాయించి, సిమెంట్ రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ మరియు ఎస్‌టీపీ (STP) వంటి అన్ని వసతులను పూర్తి చేయించింది. ఈ ఇళ్లను 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.
గత 21 నెలల కాలంలోనే ప్రభుత్వం మొత్తం 5.50 లక్షల ఇళ్లను పూర్తి చేయడం గమనార్హం. గతేడాది ఇప్పటికే 3 లక్షల ఇళ్లను పంపిణీ చేయగా, ఇప్పుడు రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను అందిస్తున్నారు. గృహప్రవేశాల అనంతరం ముఖ్యమంత్రి తిరుపతికి చేరుకుని, పేదరిక నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన 'పీ-4' (P-4) కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే వార్షికోత్సవంలో పాల్గొంటారు.