సోషల్ మీడియా నియంత్రణకు కొత్త చట్టం: హోంమంత్రి అనిత

సోషల్ మీడియాలో మితిమీరుతున్న అసభ్యకర పోస్టులు, తప్పుడు ప్రచారం, ఆన్‌లైన్ వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు...

By -  అంజి
Published on : 24 Feb 2026 10:27 AM IST

AP Govt Plans Tough Law to Regulate Social Media; May Restrict Access for School Students Under 16

సోషల్ మీడియా నియంత్రణకు కొత్త చట్టం: హోంమంత్రి అనిత

సోషల్ మీడియాలో మితిమీరుతున్న అసభ్యకర పోస్టులు, తప్పుడు ప్రచారం, ఆన్‌లైన్ వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఆంక్షలు విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సోమవారం శాసనసభలో హోంమంత్రి వంగలపూడి అనిత ఈ అంశంపై వివరాలు వెల్లడించారు.

సోషల్ మీడియా నియంత్రణకు అవసరమైన చట్టపరమైన విధివిధానాలను సూచించడానికి ఇప్పటికే ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కమిటీ ఇప్పటికే రెండుసార్లు భేటీ అయ్యింది. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అమలులో ఉన్న నిబంధనలను పరిశీలించి, ఏపీలో ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తోంది. సోషల్ మీడియాలో అసభ్యకర, తప్పుడు పోస్టులు పెట్టినందుకు ఇప్పటివరకు 1,384 కేసులు నమోదయ్యాయని, 1,067 మందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టామని హోంమంత్రి వివరించారు.

పిల్లల కోసం 'ఏజ్-అప్రోప్రియేట్ యాక్సెస్'పై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గతంలోనే మాట్లాడారు. 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను పరిమితం చేయడం లేదా పూర్తిగా నిషేధించడంపై ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. మెటా (ఫేస్‌బుక్/ఇన్‌స్టాగ్రామ్), X (ట్విట్టర్), గూగుల్, షేర్‌చాట్ వంటి సంస్థల ప్రతినిధులను తదుపరి మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి ఆహ్వానించి అంతర్జాతీయ నిబంధనలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, కేంద్ర స్థాయిలో కూడా దీనిపై చట్టం ఉండాలని కోరుతోంది.

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఇటీవల కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి, వయస్సు ఆధారిత సోషల్ మీడియా నియంత్రణపై ఒక జాతీయ విధానం తీసుకురావాలని మెమొరాండం సమర్పించారు. ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే, మైనర్లకు సోషల్ మీడియా యాక్సెస్‌ను క్రమబద్ధీకరించడంలో, ఆన్‌లైన్ వేధింపులను అరికట్టడంలో భారతదేశంలోనే ఇటువంటి చట్టం తెచ్చిన మొదటి రాష్ట్రాలలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది.

Next Story