స్టాంప్ పేపర్లు.. ఇక డిజిటల్

AP Govt plans digital stamp in registration department. రిజిస్ట్రేషన్ శాఖలో అవకతవకలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొస్తోంది.

By సునీల్  Published on  24 Aug 2022 11:28 AM IST
స్టాంప్ పేపర్లు.. ఇక డిజిటల్
  • అవకతవకలకు చెక్ పెట్టేలా
  • రిజిస్ట్రేషన్ విధానంలో సరికొత్త మార్పులు
  • మరింత సులభంగా సేవలు

ప్రభుత్వ సేవలు పొందాలంటే చేయి తడపాల్సిందే. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పాస్ బుక్.. ఇలా పని ఏదైనా పైకం ముట్టజెప్పాల్సిందే. ఎన్ని తనిఖీలు చేసినా, ఎంత నిఘా పెట్టినా జరిగేవి జరుగుతూనే ఉంటాయని మనకూ తెలుసు. ఇన్ని ఆరోపణల్లో కూరుకుపోయిన రిజిస్ట్రేషన్ శాఖలో అవకతవకలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొస్తోంది.

డిజిటల్ స్టాంపులతో సేవలు

రిజిస్ట్రేషన్‌ విధానంలో సమూల మార్పులను తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించి, కొత్త సిస్టంను తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా డిజిటల్‌ స్టాంపుల వ్యవస్థను తీసుకు రాబోతోంది. నాన్‌– జ్యూడిషియల్‌ స్టాంపు పేపర్ల విక్రయాలకు సరైన విధానం అంటూ లేదు. వెండర్లు తీసుకెళ్లి, పనిని బట్టి, రిస్కును బట్టి వసూళ్లు చేస్తుంటారు. అలాగే రిజిస్ట్రేషన్‌ చార్జీల చెల్లింపుల్లోనూ వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాటన్నింటికీ కొత్త విధానంతో తెర పడనుంది. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం పూనుకుంది.

సచివాలయాల్లో అందుబాటులోకి..

రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా డిజిటల్ స్టాంపులు అందుబాటులోకి వస్తున్నాయి. వినియోగదారుడు జరపాల్సిన డిజిటల్‌ చెల్లింపులనూ అక్కడి నుంచే పూర్తి చేస్తారు. ఇలా వ్యవస్థలో మార్పులు తేవడం ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు సులభంగా, వినియోగదారుడికి చేరువగా పూర్తవుతాయి. సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ల ద్వారా డిజిటల్ స్టాంపుల విక్రయాలతో.. వెండర్లు పాత తేదీలతో స్టాంపుల విక్రయాలు జరపడానికి ఇంక అవకాశమే ఉండదు.

బ్యాంకు చలానాలకు కాలం చెల్లు..

సచివాలయాల్లో డిజిటల్‌ స్టాంపులు కొనుగోలు చేసిన వినియోగదారుడు రిజిస్ట్రేషన్‌, యూజర్‌ చార్జీలు, స్టాంప్‌ డ్యూటీని అక్కడి నుంచే ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే సదుపాయం రాబోతోంది. ప్రస్తుతం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా బ్యాంకు చలానాల రూపంలో వాటిని చెల్లిస్తున్నారు. ఇటీవల చలానాల కుంభకోణం బయటపడిన నేపథ్యంలో పారదర్శక విధానంలో ఆన్‌లైన్‌ చెల్లింపుల విధానాన్ని తీసుకొస్తున్నారు. అందుకోసం స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలు, కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, స్టాంప్‌ వెండర్లకు డిజిటల్‌ స్టాంపులు విక్రయించేందుకు 3 వేల వరకు ఇంటర్‌ మీడియట్‌ కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి.

మధ్యవర్తుల ప్రమేయం లేకుండా..

రిజిస్ట్రేషన్లలో కొత్త విధానం ద్వారా వినియోగదారులు మధ్యవర్తులపై ఆధారపడే అవసరం ఉండదు. ఆన్‌లైన్‌లో డిజిటల్‌ స్టాంపులను కొనుగోలు చేసి అక్కడే స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలు చెల్లించవచ్చు. ఈ విధానంతో రిజిస్ట్రేషన్ల శాఖపై పని భారం, ఖర్చు తగ్గుతాయి. వినియోగదారులకు సౌకర్యంగానూ ఉంటుంది. అవకతవకలు, మధ్యవర్తుల ప్రమేయం అసలు ఉండదు. అందుకోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్‌కు రూపకల్పన చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సేవలను సచివాలయాల ద్వారా అందిస్తున్న ప్రభుత్వం డిజిటల్ విధానాన్నీ పైలెట్‌గా ప్రారంభించి, తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనుంది.

Next Story