సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెన్షన్ ను ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆయనకు సూచించింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి ఏబీ వెంకటేశ్వరరావుకు జీతభత్యాలను ఇవ్వాలని జీఏడీకి సీఎస్ ఆదేశాలు జారీ చేసింది.
భద్రతా ఉపకరణాల కొనుగోలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఏబీ వెంకటేశ్వరరావును 2020 ఫిబ్రవరి 8న ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై సుదీర్ఘ పోరాటమే చేశారు ఏబీవీ. తన సస్పెషన్‌పై హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించారు. గతనెలలో ఏబీవీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వెంటనే ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫిబ్రవరి 8 నుంచి సర్వీసులో ఉన్నట్లు గుర్తించి ఆయనకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు కల్పించాలని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఏబీవీపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.