ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వైద్య సేవలు ఇక మీ వాట్సప్‌లోనే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ వాట్సప్ సేవలు ఇప్పుడు ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాయి.
By - అంజి |
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వైద్య సేవలు ఇక మీ వాట్సప్‌లోనే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ వాట్సప్ సేవలు ఇప్పుడు ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాయి. ఆసుపత్రుల చుట్టూ తిరిగే పని లేకుండా, కేవలం ఒక్క మెసేజ్‌తో ఆరోగ్య సేవలను పొందే వీలు కలిగింది. రాష్ట్ర ప్రభుత్వ పౌర సహాయక సేవ ‘మన మిత్ర’ ఇప్పుడు పౌరులకు ఇంటివద్దే ఆరోగ్య సేవలను చేరువ చేస్తోంది. వాట్సప్ నంబర్ 9552300009కు ‘హాయ్’ అని మెసేజ్ చేయడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ (OP) అపాయింట్‌మెంట్‌ను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల గంటల తరబడి ఆసుపత్రి క్యూలైన్లలో వేచి చూడాల్సిన అవసరం తప్పుతుంది. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి, వివరాలు సమర్పిస్తే క్షణాల్లో టోకెన్ నంబర్ జనరేట్ అవుతుంది.
రక్త నిల్వలు, మందుల సమాచారం:
అత్యవసర సమయాల్లో రక్తం కోసం పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా, ఏ జిల్లాలో ఏ బ్లడ్ గ్రూప్ నిల్వలు ఉన్నాయో ఈ వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే, ఏ ఆసుపత్రిలో ఏయే మందులు, శస్త్రచికిత్స సామగ్రి అందుబాటులో ఉన్నాయో కూడా పారదర్శకంగా తెలుసుకునే వీలుంది. దీనివల్ల ఆసుపత్రికి వెళ్లిన తర్వాత మందులు లేవని వెనుదిరగాల్సిన పరిస్థితి ఉండదు.
ఆరోగ్య కార్డులు & ఆభా (ABHA) సేవలు:
‘మన మిత్ర’ ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు స్థితిగతులను తెలుసుకోవడం, అప్‌డేట్ చేయడం సులభతరం అయింది. చికిత్స అందించే ఆసుపత్రుల జాబితాను కూడా ఇందులో చూడొచ్చు. అంతేకాకుండా, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో భాగంగా 14 అంకెల ‘ఆభా’ (ABHA) సంఖ్యను పొంది, మీ ఆరోగ్య రికార్డులను డిజిటల్‌గా భద్రపరుచుకోవచ్చు. ఎక్కడికి వెళ్లినా మీ వైద్య చరిత్రను స్మార్ట్‌ఫోన్ ద్వారా వైద్యులకు చూపించే సౌకర్యం దీని ద్వారా లభిస్తుంది.