నకిలీ మద్యం కాదు.. ఆ ఇద్దరు 19 బీర్లు తాగి డీహైడ్రేషన్‌తో చనిపోయారు: Fact Check
అన్నమయ్య జిల్లా బండవడ్డీపల్లిలో నకిలీ మద్యం తాగి ఇద్దరు సాప్ట్‌వేర్ ఉద్యోగులు మరణించారన్న వైసీపీ ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది.
By - అంజి |
నకిలీ మద్యం కాదు.. ఆ ఇద్దరు 19 బీర్లు తాగి డీహైడ్రేషన్‌తో చనిపోయారు: Fact Check
అన్నమయ్య జిల్లా బండవడ్డీపల్లిలో నకిలీ మద్యం తాగి ఇద్దరు సాప్ట్‌వేర్ ఉద్యోగులు మరణించారన్న వైసీపీ ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. 'సంక్రాంతికి ఆరుగురు పార్టీ చేసుకున్నారు. వారిలో మణికుమార్ (34), పుష్పరాజ్ (26) పోటీపడి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7.30 వరకు 19 బీర్లు తాగారు. దీంతో డీహైడ్రేషన్‌కు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మణికుమార్, చికిత్స పొందుతూ పుష్పరాజ్ మరణించారు' అని ట్వీట్ చేసింది.
''అన్నమయ్య జిల్లాలో పోటీపడి 19 బీర్లు తాగి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటను నకిలీ మద్యం తాగి చనిపోయారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరం. పీలేరు నియోజకవర్గం కే వీ పల్లి మండలం బండవడ్డీపల్లిలో సంక్రాంతి సందర్భంగా ఆరుగురు యువకులు పార్టీ చేసుకున్నారు. అందులో ఇద్దరు యువకులు ఆవలకుంట మణికుమార్ (34), వేముల పుష్పరాజ్ (26) పోటీపడి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7.30 వరకూ వారు 19 బీర్లు తాగారు. అధిక సంఖ్యలో బీర్లు తాగడంతో వారు డీహైడ్రేషన్ కు గురయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మణికుమార్ మరణించగా, చికిత్స పొందుతూ పుష్పరాజ్ మరణించాడు. అదే బీరు తక్కువ తాగిన ఆవలకుంట శ్రవణ్ కుమార్ (23), పసుపులేటి శివమణి (21), ఆవలకుంట వేణుగోపాల్ (20), కోటకొండ అభిషేక్ (18) బాగానే ఉన్నారు. వారు తాగిన బీరు శాంపుళ్లను చిత్తూరు కు విశ్లేషణకు పంపించడమైనది'' అని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది.
అంతకుముందు నకిలీ మద్యం తాగి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మరణించారంటూ ప్రభుత్వంపై వైసీపీ మండిపడింది. వీరి చావులకు సీఎం చంద్రబాబు బాధ్యత తీసుకుంటారా? అని ఎక్స్‌లో ప్రశ్నించింది. అన్నమయ్య జిల్లాలో మొన్న సాయంత్రం ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం సేవించిన మణికుమార్, పుష్పరాజ్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించారని విమర్శించింది. ఎక్స్‌పైర్, నకిలీ మద్యం అమ్ముతూ టీడీపీ లిక్కర్ సిండికేట్ సొమ్ము చేసుకుంటోందని వైసీపీ ఆరోపించింది.