రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు పెరిగిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేర‌కు ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. స్కూళ్ల‌ల్లో కరోనా విస్తరించిన నేపథ్యంలో.. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు సెలవులు ప్రకటిస్తున్నామని తెలిపిన మంత్రి ఆదిమూల‌పు సురేష్.. ఏపీలో ఇంటర్, పదో తరగతి పరీక్షలు యధాతథంగా జ‌రుగుతాయ‌న్నారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని మంత్రి ఆదిమూలపు తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ తరగతులను భౌతిక దూరం పాటిస్తూ.. కరోనా నిబంధనలను అనుసరిస్తూ.. నిర్వహించాలని సూచించారు.

ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తోంది. గ‌త కొద్ది రోజులుగా ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. గ‌డిచిన‌ 24 గంటల్లో 35,922 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 6,582 కేసులు నిర్ధ‌రాణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన‌ పాజ‌టివ్ కేసుల సంఖ్య 9,62,037కు చేరింది. అత్య‌ధికంగా చిత్తూరు జిల్లాలో 1171 కేసులు న‌మోదు కాగా.. అత్య‌ల్పంగా ప‌శ్చిమ గోదావ‌రిలో 82 కేసులు న‌మోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో న‌లుగురు చొప్పున, క‌ర్నూల్‌ జిల్లాలో ముగ్గురు, గుంటూరు, అనంత‌పురం జిల్లాల్లో ఇద్ద‌రు చొప్పున‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 22 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,410కి చేరింది.
సామ్రాట్

Next Story