మందుబాబులకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న మద్యం ధరలు

ఆంధ్రప్రదేశ్‌లో ఖరీదైన మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది.

By -  అంజి
Published on : 10 March 2026 7:18 AM IST

Andhra Pradesh Liquor Prices, Excise Department AP, Premium Liquor Brands, Alcohol Price Cut, NDPL Smuggling, AP Cabinet Decision, Wine Prices AP

మందుబాబులకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న మద్యం ధరలు

ఆంధ్రప్రదేశ్‌లో ఖరీదైన మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ప్రీమియం బ్రాండ్ల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో, వాటిని భారీగా తగ్గించాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించింది. దీనివల్ల రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్న 'నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్' అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడనుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం ఏపీలో విదేశీ, ప్రీమియం బ్రాండ్ల ధరలు పొరుగు రాష్ట్రాల కంటే వేలల్లో ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు: ఒక ఖరీదైన ఫారిన్ లిక్కర్ సీసా ధర తెలంగాణలో రూ. 22 వేలు ఉంటే, ఏపీలో రూ. 25 వేలకు పైనే పలుకుతోంది. మరో బ్రాండ్ విషయంలో ఈ వ్యత్యాసం ఏకంగా రూ. 27 వేల నుండి రూ. 33 వేల మధ్య ఉంది. కర్ణాటకతో పోలిస్తే కొన్ని బ్రాండ్ల ధరలు ఏపీలో దాదాపు రెట్టింపు ఉన్నాయి. ఈ భారీ ధరల తేడా వల్ల మందుబాబులు పొరుగు రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యాన్ని తెచ్చుకుంటున్నారు. ఫలితంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు రావాల్సిన భారీ ఆదాయం పక్క రాష్ట్రాల పాలవుతోంది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా పెంచిన ధరలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాదాపు 40 బ్రాండ్లపై తగ్గించింది. అయితే, ప్రీమియం కేటగిరీలో మాత్రం మార్పులు చేయలేదు. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదన ప్రకారం.. దాదాపు 20 రకాల ఖరీదైన బ్రాండ్ల ధరలు తగ్గనున్నాయి. ఒక్కో బాటిల్‌పై కనీసం రూ. 3,000 వరకు ధర తగ్గే అవకాశం ఉంది. లిక్కర్‌తో పాటు పన్నుల భారం ఎక్కువగా ఉన్న వైన్ (Wine) ధరలను కూడా తగ్గించాలని నిర్ణయించారు.

ధరలు తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని, తద్వారా రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన ఆదాయం ఇక్కడే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే జరగనున్న క్యాబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించిన వెంటనే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.

Next Story