ఏపీలోని పేదలకు ఉగాది కానుక.. ఒకేసారి లక్ష టిడ్కో ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సొంతింటి కల సాకారం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న పేదలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది.

By -  అంజి
Published on : 28 Feb 2026 6:52 AM IST

AP TIDCO Houses, Ugadi House Distribution, Andhra Pradesh Housing Scheme, CM Chandrababu Naidu, HUDCO Loan for TIDCO, Urban Development Department, AP News Updates, TIDCO Beneficiaries Loans

ఏపీలోని పేదలకు ఉగాది కానుక.. ఒకేసారి లక్ష టిడ్కో ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సొంతింటి కల సాకారం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న పేదలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాబోయే ఉగాది (మార్చి 19) పర్వదినం నాటికి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో సిద్ధమైన లక్ష టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ అధికారిక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై, నిధుల మళ్లింపుతో ఆగిపోయిన టిడ్కో ఇళ్ల పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరుగులు పెట్టించింది.

పెండింగ్‌లో ఉన్న మౌలిక వసతులను కల్పిస్తూనే, నిధుల కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరిపింది. మిగిలిన గృహ నిర్మాణాల కోసం సుమారు 40,500 మంది లబ్ధిదారులకు ₹1,345 కోట్ల మేర రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించారు. గతంలో మొహం చాటేసిన హడ్కో, ప్రస్తుత ప్రభుత్వ గ్యారంటీతో ₹4,451 కోట్ల భారీ రుణాన్ని మంజూరు చేసేందుకు ముందుకు రావడం విశేషం. ఇందులో 300 చ.అ. విస్తీర్ణం ఉన్న ఇళ్లు 54,934, 365 చ.అ విస్తీర్ణం ఉన్నవి 16,223, 430 చ.అ విస్తీర్ణం ఉన్నవి 28,986 ఉన్నాయి.

వీటికి ఉగాది సందర్భంగా సీఎం చేతులమీదుగా లబ్ధిదారులతో గృహప్రవేశాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాచరణ ప్రకారం, కేవలం ఉగాదితోనే ఆగకుండా జూన్ నాటికి మొత్తంగా 2.61 లక్షల ఇళ్లను పేదలకు అప్పగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల వాటా నిధులను ఇతర అవసరాలకు మళ్లించడంతో అనేక మంది బ్యాంక్ ఖాతాలు నిరర్థక ఆస్తులు (NPA)గా మారాయి. ఆ సమస్యలన్నింటినీ అధిగమిస్తూ, మౌలిక వసతులు పూర్తి చేసి ఇళ్లను పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

Next Story