ఏపీలో లాక్ డౌన్ పొడిగింపు.. నేడు లేదా రేపు స‌ర్కార్ ఉత్త‌ర్వులు.. !

AP Government to extend lockdown.ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. దీంతో ఈ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 May 2021 2:47 PM IST
ఏపీలో లాక్ డౌన్ పొడిగింపు.. నేడు లేదా రేపు స‌ర్కార్ ఉత్త‌ర్వులు.. !

ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. దీంతో ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి ప్ర‌స్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్ అమ‌లు అవుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. నిత్యావ‌స‌ర వ‌స్తువుల కొనుగోలుకు ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఇచ్చింది. మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల త‌రువాత క‌ర్ఫ్యూ అమ‌లు అవుతోంది. దీంతో ప్ర‌స్తుతం కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతోంది. కాగా.. ఈ క‌ర్ఫ్యూ లాక్‌డౌన్ ఈ నెల చివ‌రితో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ను మ‌రో రెండు నుంచి మూడు వారాలు పెంచే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై శ‌నివారం లేదా ఆదివారం ప్ర‌భుత్వం నిర్ణ‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

చిత్తూరు జిల్లాలో మరింత కఠినంగా ఆంక్షలు..

చిత్తూరు జిల్లాలో జూన్ 1 నుంచి 15 వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ ఆంక్ష‌లు మరింత క‌ఠినంగా అమ‌లు చేయ‌నున్న‌ట్లు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే సరుకుల కొనుగోలుకు అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. చిత్తూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్టు మంత్రి చెప్పారు. నిన్న ఒక్క రోజే 2,291 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 15 మంది మ‌ర‌ణించారు. ఇప్పటివరకు జిల్లాలో 1.85లక్షల మందికి పైగా క‌రోనా బారిన పడ్డారు. వీరిలో 1.63లక్షల మందికి పైగా కోలుకున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 1,254మంది మ‌ర‌ణించారు.

కాగా.. శుక్ర‌వారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన బులిటెన్ ప్ర‌కారం.. కొత్తగా 14,429 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 20,746 మంది కోలుకున్నారు. 103 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,65,7986కు పెరిగాయి. 1,46,6990 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్‌ కేసులు 1,80,362కు చేరాయి. మొత్తం 10634 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 84,502 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Next Story