ప్రతి నెలా అప్పుల తిప్పలు!

AP Government Struggle for debts for every month.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతి నెలా అప్పుల తిప్పలు తప్పడం లేదు.

By సునీల్  Published on  27 Aug 2022 1:46 PM IST
ప్రతి నెలా అప్పుల తిప్పలు!
  • ఆదాయం పెరిగినా తప్పని లోటు
  • ఇప్పటికే దాటిన పరిమితి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతి నెలా అప్పుల తిప్పలు తప్పడం లేదు. కొవిడ్ వల్ల ఏర్పడిన ఆర్థిక లోటును ఇప్పటికే అధిగమించింది. ఆదాయ మార్గాలూ పెరిగాయి. అయినా సంక్షేమ క్యాలెండర్‌ను అమలు చేయడం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వేలంలో పాల్గొని అప్పులు తీసుకోవచ్చు. అన్ని రాష్ట్రాలు తమ అవసరాల మేరకు వేలంలో పాల్గొంటాయి. అయితే ఏపీ మాత్రం నెలలో ప్రతి మంగళవారం ఆర్బీఐ ద్వారా అప్పులు తీసుకుంటోంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అప్పులు తెస్తే కానీ ఉద్యోగుల జీతాలు చెల్లించే పరిస్థితి లేదు. ఒకట్రెండు తేదీల్లో ఇచ్చే పెన్షన్లూ అందించలేదు. జీతాలు, పెన్షన్లు, పథకాల వ్యయం రాష్ట్రానికి సమకూరుతున్న ఆదాయం కన్నా ఎక్కువ ఉండటమే కారణం. అయితే ఆదాయాన్ని పెంచుకునే మార్గాల కన్నా అప్పులు చేయడంపైనే ప్రభుత్వం దృష్టి పెడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీ చేస్తున్న అప్పులు రాష్ట్రానికి గుదిబండగా మారిపోతున్నాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ పరిస్థితి శ్రీలంకలా మారిపోతుందని ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన ఆరోపణలు చేస్తున్నాయి. అప్పులకు అవసరమైన సహకారాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందిస్తోంది. మళ్లీ అదే బీజేపీ రాష్ట్ర శాఖ మాత్రం ఏపీని శ్రీలంకలా మార్చేస్తున్నారని విమర్శిస్తోంది. జనసేన పార్టీ అప్పులపై వ్యంగ్య కార్టూన్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా విమర్శలకు దిగుతోంది. టీడీపీ అయితే నేరుగా జగన్ పాలనా వైఫల్యాల వల్లే రాష్ట్రం మునిగిపోతోందంటూ మండిపడుతోంది.

ఏపీ చేసినన్ని అప్పులు దేశంలోని ఏ ఇతర రాష్ట్రం కూడా చేయలేదా అని పరిశీలిస్తే.. తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బంగాల్ తదితర రాష్ట్రాలు ఇంకా ముందు ఉన్నాయి. తమిళనాడు అత్యధికంగా రూ. 6.59 లక్షల కోట్ల అప్పులుండగా, యూపీ రూ. 6.53 లక్షల కోట్ల అప్పులు చేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అప్పులు 3.95 లక్షల కోట్లు దాటాయి. అయితే ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ అప్పులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నట్లే. అయితే అసలు అప్పు ఇంకా ఎక్కువని, కార్పొరేషన్ల ద్వారా, ఇతర విధానాల్లో తెచ్చిన అప్పులు లెక్కల్లో చూపడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఏపీ ప్రభుత్వానికి నెలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ. 11 కోట్ల వరకు ఉంది. అయితే జీతాలు, ఇతర ఖర్చుల కోసం రూ. 17 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఆరు వేల కోట్ల లోటును భర్తీ చేసుకోవడం కోసం అప్పులు చేస్తోంది. ఈ రకంగా నెలనెలా అప్పులు చేస్తూ వస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది కేంద్రం విధించిన పరిమితినీ దాటేసింది. కేంద్రం 9 నెలల్లో 43 వేల 803 కోట్ల అప్పులకు అనుమతించగా ఆ మొత్తాన్ని ఇప్పటికే దాటేసి 44 వేల 604 కోట్లకు చేరింది. ఆర్బీఐ సెక్యూరిటీ వేలంలో 2 వేల కోట్ల అప్పులు తేవడం ద్వారా 46 వేల కోట్లు దాటుతుంది. మరోవైపు తెచ్చిన అప్పులకు అసలు చెల్లించడం అటుంచితే వడ్డీల భారమే తడిసి మోపెడవుతోంది.

Next Story