ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్, RC కార్డులకు గుడ్‌బై
ఏపీలో వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్‌సీలు ఇకపై కార్డు రూపంలో ఉండవని రాష్ట్ర రవాణాశాఖ వెల్లడించింది.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 3:42 AM GMTఏపీలో డ్రైవింగ్ లైసెన్స్, RC కార్డులకు గుడ్‌బై
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్‌సీలు ఇకపై కార్డు రూపంలో ఉండవని రాష్ట్ర రవాణాశాఖ వెల్లడించింది. సంబంధిత యాప్‌లో డౌన్‌లోడ్ చేసిన పత్రాలే దీనికి సరిపోతాయని రవాణాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. ఇప్పటి వరకు కార్డుకు రూ.200, పోస్టల్ సర్వీస్‌కు రూ.25 మొత్తం రూ.225 చలానాతో కలిపి వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ చార్జీలను వసూలు చేయడం లేదని రవాణా శాఖ కమిషనర్ ప్రకటనలో తెలిపారు. ఇక ఇప్పటికే డబ్బులు చెల్లించిన పలువురు వాహనదారులకు మాత్రం త్వరలోనే కార్డులు అందజేస్తామని రవాణా శాఖ కమిషనర్ ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖకు సంబంధించి 'పరివాహన్' పేరుతో సేవలన్నింటినీ ఆన్‌లైన్ చేసింది. లైసెన్స్‌లు, ఆర్‌సీ కార్డులను తొలగించి.. వాటిని డిజిటల్ రూపంలోనే అందంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఇదే పద్ధతిని ఇప్పుడు ఏపీలోనూ అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకుగాను రవాణాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే రవాణాశాఖ వెబ్‌సైట్ ఏపీఆర్‌టీఎసిటిజన్.ఈప్రగతి.ఓఆర్జీలో ఫారం 6 లేదా 23ని డౌన్‌లోడ్ చేసుకుని డిజిటల్ కార్డును పొందేందుకు పొందవచ్చు. లేదంటే ఏపీఆర్‌టీఎసిటిజన్ ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని అందులోనూ డిజిటల్ కార్డుని పొందవచ్చు. అయితే.. దీన్నే వాహనాల్ని తనిఖీలు చేసే పోలసీఉలు, రవాణాశాఖ అధికారులకు చూపిస్తే సరిపోతుంది. వీటిని అనుమతించాలంటూ రహదారులపై వాహనాలను తనిఖీ చేసే పోలీసులు, రవాణా తదితర శాఖల అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.