'ఈ-టంగ్ టూ ఈ-నోస్'.. తిరుమలలో రూ. 25 కోట్లతో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్

తిరుమల శ్రీవారి ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు, భక్తులకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

By -  అంజి
Published on : 23 Feb 2026 10:26 AM IST

Tirumala Food Lab, Satya Kumar Yadav, TTD Ghee Quality, Electronic Nose, Electronic Tongue, FSSAI Tirumala, Andhra Pradesh News, Tirumala Prasadam Testing

'ఈ-టంగ్ టూ ఈ-నోస్'.. తిరుమలలో రూ. 25 కోట్లతో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ 

తిరుమల శ్రీవారి ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు, భక్తులకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికోసం తిరుమలలో రూ. 25 కోట్ల భారీ వ్యయంతో అత్యున్నత ప్రమాణాలు కలిగిన 'స్టేట్ ఆఫ్ ది ఆర్ట్' ఫుడ్ లాబొరేటరీని ఏర్పాటు చేస్తోంది. గతంలో నెయ్యి కల్తీపై జరిగిన వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

రాష్ట్ర ఆరోగ్య మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ల్యాబ్‌కు సంబంధించిన సివిల్ మరియు మౌలిక సదుపాయాల పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. వచ్చే నెల (మార్చి) నుంచి ఈ ల్యాబ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ల్యాబ్‌లో అన్నిటికంటే ప్రత్యేకమైనవి 'Electronic Tongue' (ఈ-టంగ్), 'Electronic Nose' (ఈ-నోస్‌) యంత్రాలు. మనిషి నాలుక రుచిని, ముక్కు వాసనను ఎలా గుర్తిస్తాయో.. ఈ యంత్రాలు అంతకంటే కొన్ని వేల రెట్ల కచ్చితత్వంతో నెయ్యి మరియు ఇతర పదార్థాల వాసనను, రుచిని విశ్లేషిస్తాయి.

సుమారు రూ. 3.5 కోట్ల వ్యయంతో వీటిని ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటికి అవసరమైన ప్రత్యేక గ్యాస్ సిలిండర్లను కూడా అక్కడి నుంచే తెప్పిస్తున్నారు. మే నెల నాటికి ఇవి పూర్తిస్థాయిలో ఇన్‌స్టాల్ అవుతాయి. తిరుమల పిండి మిల్లు ప్రాంగణంలోని 12,000 చదరపు అడుగుల రెండంతస్తుల భవనంలో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 60 రకాల ముడి పదార్థాలు అయిన నెయ్యి, జీడిపప్పు, కిస్‌మిస్, బాదం, శనగపప్పు, పంచదార, యాలకులు, పసుపు, కారం వంటి అన్ని రకాల వస్తువులను పరీక్షిస్తారు.

సూక్ష్మ తనిఖీలు: 200 రకాల పురుగుమందుల అవశేషాలు, భార లోహాలు (Heavy Metals), యాంటీబయాటిక్స్, హానికరమైన బ్యాక్టీరియాలను గుర్తించేందుకు 50కి పైగా అత్యాధునిక పరికరాలను సిద్ధం చేశారు. టీటీడీ సరఫరా చేసే తాగునీరు, భక్తులకు అందించే ఆహార పదార్థాలను కూడా నిత్యం తనిఖీ చేస్తారు.

కేంద్రం మరియు FSSAI సహకారం:

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించాయి. అక్టోబర్ 2024లో FSSAIతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కేంద్రం ఈ ప్రాజెక్టుకు రూ. 23 కోట్లు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక పుణ్యక్షేత్రంలో ఇంతటి భారీ ల్యాబ్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి.

భక్తులకు భరోసా:

ఈ ల్యాబ్ నిర్వహణ కోసం ఆరోగ్య శాఖ మరియు టీటీడీ సంయుక్తంగా 40 మంది నిపుణులను నియమించనున్నాయి. భక్తులకు నాణ్యమైన, పవిత్రమైన ప్రసాదాన్ని అందించడంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఇది భక్తులలో టీటీడీపై నమ్మకాన్ని మరింత పెంచుతుందని మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story