నిన్న ఇంటర్ పరీక్షలు రద్దు.. నేడు మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వంగత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! 02-05-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గడచిన 24 గంటల్లో ఏపీలో 1,14,299 నమూనాలు పరీక్షించగా 23,920 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,945 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 2,831 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 2,724 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 11,411 మంది కరోనా నుంచి కోలుకోగా, 83 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది బలయ్యారు. ఆదివారం నాడు ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా కేసులు పెరుగుతూ ఉన్న రాష్ట్రాలు చాలా వరకూ లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు కఠిన నిర్ణయాలను తీసుకున్నారు. ఏపీలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 05-05-2021 నుంచి అమల్లోకి వచ్చేలా కర్ఫ్యూ విధించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతించనున్నారు. ఈ సమయంలో ప్రజలు గుమికూడకుండా 144 సెక్షన్ అమలు చేయనున్నారు. అన్ని రకాల అత్యవసర సర్వీసులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు. బుధవారం నుంచి 14 రోజుల పాటు ఈ పాక్షిక కర్ఫ్యూ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలవుతుండగా.. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు. లాక్ డౌన్ విషయంలో ఎక్కడిక్కడ నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కేంద్రం రాష్ట్రాలకే అప్పగించింది. ఈ నేపథ్యంలో, పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని జగన్ సర్కారు భావిస్తోంది.

సామ్రాట్

Next Story