ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై సస్పెన్షన్‌ వేటు పడింది.

By Srikanth Gundamalla  Published on  25 July 2023 11:17 AM GMT
AP, Govt Employees Union, President, suspended,

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై సస్పెన్షన్‌ వేటు పడింది. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ ఉత్తర్వులు కొనసాగుతాయని ప్రభుత్వం వెల్లడించింది. సూర్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రొసీడింగ్ విడుదల చేసింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చీఫ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. 2023, మే 30వ తేదీన కేసు రిజిస్టర్‌ అయ్యింది. ఈ కేసులో ఏ-5గా సూర్యనారాయణ ఉన్నారు. 2019 నుంచి 2021 మధ్య కేఆర్‌ సూర్యనారాయణ, మెహర్ కుమార్, సంథ్య, వెంకట చలపతి, సత్యనారాయణలతో కలిసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. సూర్యనారాయణ తప్ప మిగిలిన వారిని విచారించారు. వారు సూర్యనారాయణతో కుట్రలు చేసిన వివరాలు తెలిపారు. దీనిపై సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం విజయవాడ ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపి నిర్ణయం తెలపాలని ఏసీబీ కోర్టును ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలోనే ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించే వరకు సూర్యనారాయణపై చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ కోర్టు సూర్యనారాయణ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో.. ఏపీ ప్రభత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై సస్పెన్షన్‌ వేటు వేసింది ప్రభుత్వం.


Next Story