తెలంగాణ లో పదో తరగతి పేపర్ల లీక్ వ్యవహారంపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పరీక్షా పత్రాల లీక్‌కు పాల్పడిన వారిని దేవుడు కూడా క్షమించడని, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడం దౌర్భాగ్యమని వెల్లడించారు. ఏపీలో పదో తరగతి పరీక్షలు పటిష్ఠంగా నిర్వహిస్తున్నామని బొత్స స్పష్టం చేశారు. గతేడాది పేపర్ లీక్ కు పాల్పడిన 75 మందిపై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ ఏడాది పేపర్ లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని వివరించారు.
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం రాష్ట్రంలో ఒక విప్లవాత్మక కార్యక్రమంగా అభివర్ణించారు మంత్రి బొత్స. దేశంలో ఎక్కడా లేని విధంగా, పేదల ఇంటివద్దకే వైద్య సేవలను అందించడం ఒక వినూత్న ప్రక్రియగా పేర్కొన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అండగా ఉంటుందని బొత్స సత్యనారాయణ అన్నారు. ఇంటివద్దకే వైద్య సేవలను అందించేందుకు ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మండలంలోని ద్వారపూడి గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ సేవలను మంత్రి బొత్స సత్యనారాయణ లాంచనంగా ప్రారంభించారు. 104 సంచార వైద్యశాలలను ఆయన ప్రారంభించారు.