ఇచ్చిన హామీలే కాదు.. ఇవ్వని వాటిని నెరవేస్తున్నాం : సీఎం జగన్
AP CM YS Jagan Launches YSR EBC Nestham Scheme.ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని నెరవేర్చడంతో పాటు ఇవ్వని
By తోట వంశీ కుమార్ Published on 25 Jan 2022 7:35 AM GMTఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని నెరవేర్చడంతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాజ్యాంగ స్పూర్తిని అనుసరిస్తూ అడుగులు వేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈబీసీ నేస్తం ద్వారా అగ్ర వర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఈబీసీ నేస్తం పథకం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం కాదని.. అయినప్పటికీ అగ్ర వర్ణ పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారత లక్ష్యం కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈబీసీ నేస్తం పథకం ద్వారా రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్యులు, క్షత్రియులు, వెలమతోపాటు ఇతర అగ్రవర్ణ పేద మహిళలకు ఏటా రూ.15 వేలు చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు ఆర్థికసాయం అందనుంది. అందులో భాగంగా తొలి విడుతగా నేడు రాష్ట్రవ్యాప్తంగా 3.93 లక్షల మంది ఖాతాల్లో రూ.589 కోట్లు జమ చేశారు. 45 ఏళ్లకు పైబడి 60 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు.
ఈ పథకానికి ఎవరు అర్హులంటే..?
- వార్షిక కుటుంబ ఆదాయం.. గ్రామాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో నెలకు రూ. 12 వేలు పరిమితిని మించకూడదు.
- కుటుంబంలో ఎవరూ కూడా ప్రభ్యుత ఉద్యోగి గానీ, పెన్షన్‌ర్ గాని, ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతున్నవారు గానీ ఉండకూడదు.
- కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా ఫోర్ వీలర్ ఉండవద్దు.
- లబ్ధిదారుల పేరుతో ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉండాలి.
- మాగాణి భూమి 3 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. మాగాణి, మెట్ట భూమి రెండూ కలిపి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి.