పోలవరం ప్రాజెక్టు సందర్శనకు నేడు సీఎం జగన్
AP CM Jagan Polavaram Visit Today.ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోమవారం పోలవరంలో పర్యటించనున్నారు
By తోట వంశీ కుమార్ Published on 19 July 2021 10:32 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోమవారం పోలవరంలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ప్రత్యక్షంగా సీఎం పరిశీలించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. 11నుంచి 12 గంటల మధ్య పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు అధికారులతో సమావేశమై ప్రాజెక్టు పనులపై సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు తీసుకోవల్సిన అంశాలపై అధికారులకు సీఎం జగన్ కీలక సూచనలు చేయనున్నారు. తిరిగి మధ్యాహ్నం 2.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
నిజానికి గత వారమే సీఎం పోలవరం పర్యటనకు వెళ్ళాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఈ పర్యటన రద్దు అయిన విషయం తెల్సిందే. గత ఏడాది డిసెంబర్‌లో పోలవరం పర్యటన చేపట్టిన జగన్..ఆ తరవాత కరోనా పెరగడంతో ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లలేకపోయారు. ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరగడంతో మొత్తం ప్రాజెక్ట్ పనులను పరిశీలించాలని డిసైడైన సీఎం ఈరోజు పోలవరం పర్యటనకు రెడీ అయ్యారు. మరోవైపు, ప్రాజెక్టు పనులు దగ్గరపడుతుండటంతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. స్థానికంగా, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో గోదారి గలగలలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఉంచడంతో దిగువకు గోదారమ్మ ఉరకలెత్తుతోంది.