అనారోగ్యంతో మృతి చెందిన బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం సాయంత్రం కడప వెళ్లిన సీఎం.. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య నివాసానికి చేరుకుని వెంకట సుబ్బయ్య భౌతికకాయం వద్ద అంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
గత కొంతకాలంగా వెంకట సుబ్బయ్య ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆయన కొన్నిరోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే.. శనివారం ఆయన మరోమారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను కడపలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. వెంకట సుబ్బయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకట సుబ్బయ్య రాజకీయాల్లోకి రాకముందు ఎముకల డాక్టర్‌గా పనిచేశారు. 1960లో జన్మించిన వెంకట సుబ్బయ్య ఆర్థోపెడిక్ సర్జన్‌గా ప్రజలకు సేవలందించారు. 2016లో ఆయన బద్వేల్ వైఎస్సార్‌సీపీ కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు. 2019లో తొలిసారిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్‌పై 44 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.