యూఎస్‌లో ఏపీ యువతి మృతిపై కేంద్రానికి సీఎం జగన్ లేఖ

అమెరికాలో పోలీస్‌వాహనం ఢీకొని ఏపీకి చెందిన యువతి మృతిచెందిన సంఘటనపై కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు.

By Srikanth Gundamalla
Published on : 14 Sept 2023 5:45 PM IST

CM Jagan, Letter, Jahnavi Death, US, Central Govt,

యూఎస్‌లో ఏపీ యువతి మృతిపై కేంద్రానికి సీఎం జగన్ లేఖ

ఏపీకి చెందిన విద్యార్ధిని కందుల జాహ్నవి అమెరికాలో రోడ్డుప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. పోలీస్‌ వాహనం ఢీకొనడంతోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే.. ఈ సంఘటనపై ఏపీ సీఎం జగన్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌కు లేఖ రాశారు.

ఏపీకి చెందిన విద్యార్ధిని కందుల జాహ్నవి అమెరికాలో జనవరి 23, 2023 న రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న పోలీస్‌ వాహనం ఢీకొట్టి ప్రాణాపాయానికి గురైందని లేఖలో సీఎం జగన్ రాశారు. ఆమె అమెరికాలోని నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్శిటీ సీటెల్‌ క్యాంపస్‌లో ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతుందని తెలిపారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం వెంటనే ఆమె కుటుంబాన్ని, తెలుగు అసోసియేషన్‌ను సంప్రదించి ఆమె మృతదేహాన్ని కర్నూలు జిల్లాలోని ఆమె స్వగ్రామానికి తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేసిందని లేఖలో తెలిపారు సీఎం జగన్. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఆమె స్వగ్రామానికి అంబులెన్స్‌ కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు.

తాజాగా కందుల జాహ్నవి మరణంపై దర్యాప్తు చేస్తున్న ఒక పోలీస్‌ అధికారి (సీటెల్‌ పోలీస్‌ అధికారి) ఆమె మరణాన్ని అపహాస్యం చేస్తున్నట్లు వచ్చిన వీడియోను కూడా అందరూ గమనించారని లేఖలో జగన్ పేర్కొన్నారు. ఆ వీడియోలో ఒక అమాయక విద్యార్ధి జీవితాన్ని తక్కువ చేసి మాట్లాడారని తెలిపారు. నాన్‌ అమెరికన్ల పట్ల అలాంటి అధికారుల అమానవీయ ప్రవర్తనను అందరూ ఖండించాలని సీఎం జగన్ కోరారు. తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలకు సిఫార్సు చేయాలని సీఎం జగన్ లేఖలో విజ్ఞప్తి చేశారు. భారతీయులలో విశ్వాసం, భరోసా కలిగించేలా చర్యలు ఉండాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి జైశంకర్‌ను కోరారు ఏపీ సీఎం జగన్. ఈ దురదృష్టకర పరిస్ధితిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. యూఎస్‌లోని సంబంధిత అధికారులతో తక్షణమే చర్చించి, వాస్తవాలు వెలికితీసి మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. భారతదేశంలోని అమెరికా రాయబారితో కూడా చర్చించి తగిన సూచనలివ్వాలని సీఎం జగన్ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.

Next Story