ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం-వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మొక్క నాటి వన మహోత్సవం-2021 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చెట్ల పెంపకం ఓ యజ్ఞంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించారు. చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదని పేర్కొన్నారు. చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా పడతాయన్నారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు.
అందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి బాలినేని
పర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నాడు-నేడు పథకంలో భాగంగా స్కూళ్లు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటాలని ఆయన పిలుపు నిచ్చారు. పచ్చదనం పెంపొందించడం, అడవుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు.