ఏపీ సీఎం జగన్ శుక్రవారం మాచర్లలో పర్యటించారు. జాతీయ పతకాన్ని రూపొందించి వందేళ్లు పూరైంది. ఈ సందర్భంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం జగన్ కలిశారు. గుంటూరు జిల్లా మాచర్లలో నివసిస్తున్న ఆయన కుమారై ఘంటసా సీతామహాలక్ష్మిని ఈ సందర్భంగా సన్మానించారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పింగళి కూతురు స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని సీఎం జగన్‌తో పంచుకున్నారు. పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి తిలకించారు.
ముఖ్యమంత్రి స్వయంగా తమ ఇంటికి రావడంతో సీతామహలక్ష్మి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులకు సన్మానంతో రాష్ట్రంలో ఈ వేడుకలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.