ప్రజలు తమ వద్దకు వచ్చినప్పుడు వారి బాధలు, సమస్యల గురించి అధికారులు, సిబ్బంది ఓపికగా వినాలని అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఏపీ సెక్రటేరియట్‌లో పబ్లిక్ పెర్‌సెప్షన్‌పై సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమంశు శుక్లా ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వంలో కొంత మంది అధికారులు, సిబ్బంది ప్రజలతో ప్రవర్తించే తీరు కారణంగా చెడ్డ పేరు వస్తోందన్నారు. పింఛన్లు పంపిణీకి మనం రెండు రోజులు సమయం పెట్టుకున్నామని, పింఛన్ల పంపిణీలో కొంత మంది లబ్ధిదారులతో దురుసుగా ప్రవర్తించడం, దబాయించడం లాంటి ఫిర్యాదులు తమ దృష్టికి వస్తున్నాయని.. దీని కారణంగా ప్రజల్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.
ప్రజలకు సేవకులం అనే భావనతోనే సత్ఫలితాలు వస్తాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ముందు మన ప్రవర్తనలో మార్పు రావాలని, అందరం ప్రజలకు జవాబుదారీ అనేది గుర్తుంచుకోవాలని తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికే ఉన్నామనే భావన మనలో ఉన్నప్పుడు ప్రజలో మనం ప్రవర్తించే తీరు ఒకలా ఉంటుందని.. అలా కాకుండా ఇక్కడ నాదే పెత్తనం అనే ధోరణితో ఉంటే మన ప్రవర్తన, సమస్యల పరిష్కరించే తీరే భిన్నంగా ఉంటుందన్నారు. అయితే వాటిన్నికంటే ముందు ప్రజలు తమ వద్దకు వచ్చినప్పుడు వారి బాధలు, వారి సమస్యలను ఓపికగా వినడం ప్రధానమని సీఎం చంద్రబాబు సూచించారు. అధికారుల పని తీరు అంచనా వేయడంలో వారి ప్రవర్తన కూడా చాలా కీలకంగా ఉంటుందని.. దీనిని గుర్తుంచుకుని అందరూ పని చేయాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న పనుల పట్ల ప్రజల్లో ఉన్న సంతృప్తి మదింపు వేయడానికి ఒక వినూత్న పద్ధతిని అమలు చేస్తున్నామన్నారు.