టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై సీఐడీ కేసు

AP CID Files case Against TDP MLC Ashok babu.తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సీఐడీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jan 2022 4:16 PM IST
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై సీఐడీ కేసు

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సీఐడీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. గ‌తంలో ఏసీటీవోగా ఉన్న కాలంలో త‌ప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోప‌ణ‌ల‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు సీఐడీ అధికారులు తెలిపారు. అశోక్ బాబు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ అధికారిగా పనిచేసిన సమయంలో తన సర్వీస్ రికార్డులో విద్యార్హతలను తప్పుగా పేర్కొన్నందుకు ఆయనపై ఫోర్జరీ కేసు నమోదైంది. 477A, 465 (ఫోర్జరీ), 420 (చీటింగ్) సెక్షన్ల కింద అధికారులు కేసు నమోదు చేశారు.

బీకాం చ‌ద‌వ‌కుండ‌నే ఆయ‌న న‌కిలీ స‌ర్టిఫికెట్లు పెట్టార‌ని అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. కాగా 2021లో అశోక్‌బాబుపై లోకాయుక్తలో కేసు నమోదు కాగా.. ఆ కేసును సీఐడీకి అప్పగించాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అశోక్ బాబు.. సర్వీస్‌ రికార్డులో బీకాం గ్రాడ్యుయేట్‌గా చూపించారని ఏపీ కమర్షియల్‌ టాక్సెస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బి.మెహర్‌ కుమార్‌ చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన లోకాయుక్త.. 2021 ఆగ‌స్టులో అశోక్‌బాబు కేసును సీఐడీ కి అప్ప‌గించాలంటూ ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అశోక్ బాబు ఎపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్సీ గా ఎన్నిక‌య్యారు.

Next Story