తన సెల్‌ఫోన్‌ను అనధికారికంగా జప్తు చేసినట్లు, ఆ ఫోన్‌ నుంచి వాట్సాప్‌ సందేశాలు వెళ్తున్నట్లు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఏపీ సీఐడీ విభాగం స్పష్టం చేసింది. ఈ మేర‌కు సోమ‌వారం సీఐడీ కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ఈ వ్య‌వ‌హారాల‌న్నింటినీ సుప్రీం కోర్టుకు నివేదిస్తామ‌ని వివ‌రించింది. ర‌ఘురామ‌ను అరెస్ట్ చేసిన త‌రువాత దర్యాప్తులో భాగంగా నిబంధనల ప్రకారమే ఆయన సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశామని తెలిపింది. అది ఐఫోన్ 11 ప్రొ మాక్స్ అని, అందులో 9000911111ఎయిర్‌టెల్ సిమ్ ఉంద‌ని ర‌ఘురామ వాంగూల్మం ఇచ్చార‌ని పేర్కొంది.

సెల్‌ఫోన్‌ జప్తు సమయంలో సాక్షుల సమక్షంలో సీజ‌ర్ మెమో సిద్ధం చేసి ఫోన్‌ను సీల్డ్ క‌వ‌ర్‌లోని ఫోన్‌ను విశ్లేష‌ణ కోసం మే 18న ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ప్ర‌యోగ‌శాల‌కు(ఏపీఎఫ్ఎస్ఎల్‌) పంపించామ‌ని వెల్ల‌డించింది. కాగా ఆయన ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 9000922222 అనే సిమ్‌ నంబరుతో ఉన్న తన సెల్‌ఫోన్‌ను సీఐడీ అధికారులు జప్తు చేశారని పేర్కొన్నట్టు పత్రికల్లో ప్రచురితమైంది. సెల్‌ఫోన్‌ జప్తు సమయంలో సాక్షుల సమక్షంలో చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మే 18 నుంచి ఫోన్‌, సిమ్‌, ఏపీఎస్ఎఫ్ఎల్ ఆధీనంలోనే ఉంది. సీఐడీ దానిని వినియోగించే అవ‌కాశం లేద‌ని చెప్పింది. ఆ ఫోన్‌లో ఏనెంబ‌ర్ సిమ్ ఉందో సీఐడీకి తెలియ‌దు. ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీ నుంచి తుది నివేదిక రావాల్సి ఉందని.. ఆ తరువాతే ఆ సెల్‌ఫోన్ లో ఏ నెంబ‌ర్ సిమ్ ఉంది అన్న వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయ‌ని తెలిపింది.

తోట‌ వంశీ కుమార్‌

Next Story