ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సస్పెన్షన్ సమయంలో మీడియాతో మాట్లాడినందుకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధన పాటించకుండా మీడియా సమావేశం నిర్వహించడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడటంపై వివరణ కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. నోటీసు అందిన వారం రోజుల లోపు వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని సీఎస్ ఆ నోటీసులో పేర్కొన్నారు.
గత నెల 21న పెగాసస్‌తో పాటు తన సస్పెన్షన్ అంశాలపై ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.ఏపీ అసెంబ్లీలో పెగాసెస్ అంశంపై చర్చ జరిగి హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న రోజునే హైద్రాబాద్ లో వెంకటేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పెగాసెస్ సాప్ట్ వేర్ ను 2019 మే వరకు ఉపయోగించలేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న తనకు ఈ విషయాలు తెలుసునన్నారు. పెగాసెస్ సహా ఇతర ఎలాంటి సాఫ్ట్ వేర్ లు ఉపయోగించలేదన్నారు.
పెగాసెస్ పై హౌస్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడడంపై నిబంధనలు చూపుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా ప్రెస్‌మీట్ పెట్టడం తప్పేనని మెమోలో పేర్కొన్నారు. ఈ షోకాజ్ నోటీసుకు సరైన వివరణ ఇవ్వకుంటే తదుపరి చర్యలు తీసుకోనున్నారు.