కర్నూలు: బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తల్లిదండ్రులు బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించారు. యశ్వీర్, ఉషా సునక్‌లు.. రిషి సునక్ అత్తగారు సుధా మూర్తితో కలిసి మంత్రాలయంలోని ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో బుధవారం వెల్లడించింది. ''ఈరోజు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తండ్రి యశ్వీర్ సునక్, ఉషా సునక్ తల్లిదండ్రులు శ్రీ క్షేత్రం మంత్రాలయాన్ని సందర్శించారు. వారి వెంట ఇన్ఫోసిస్‌కి చెందిన సుధా నారాయణ మూర్తి వచ్చారు. అందరూ కలిసి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు'' అని పోస్ట్ చేసింది.
బుధవారం ఉదయం దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ప్రముఖులకు శ్రీ మఠం అధికారులు స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్రుని దర్శించుకుని మంగళ హారతులు స్వీకరించారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంధ్రతీర్థులు వారికి శేష వస్త్రం ఫల మంత్రాక్షతలు జ్ఞాపికను అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్వామి వారి ప్రసాదాన్ని బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్‌కి అందించాలని తల్లిదండ్రులకు అప్పగించారు. మఠం బ్రిటీష్ ప్రధాని తల్లిదండ్రులు, అత్తగారికి సంబంధించిన కొన్ని చిత్రాలను కూడా పోస్ట్ చేసింది.