11 సీట్లకు ప్రతిపక్ష హోదా ఎలా? చట్టాలపై అవగాహన ఉందా? జగన్‌పై ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఫైర్

మాజీ సీఎం జగన్‌ను అసెంబ్లీకి రావాలని మొదటి నుంచీ కోరినట్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.

By Knakam Karthik  Published on  10 Feb 2025 7:00 PM IST
Andrapradesh News, Ap Assembly, Speaker Ayyannapatrudu, Ys JaganMohanReddy

11 సీట్లకు ప్రతిపక్ష హోదా ఎలా? చట్టాలపై అవగాహన ఉందా? జగన్‌పై ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఫైర్

మాజీ సీఎం జగన్‌ను అసెంబ్లీకి రావాలని మొదటి నుంచీ కోరినట్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. అయినా కూడా ఆయన సమావేశాలకు రావడం లేదని.. భారతదేశంలో ఎక్కడైనా ఇలాంటిది ఉందా? చట్టాలపై అవగాహన ఉండే మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు ఇచ్చినంత సమయమే తనకూ కావాలని జగన్‌ అడుగుతున్నారన్న ఆయన.. ఏ రూల్‌ ప్రకారం ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలని నిలదీశారు. జగన్‌ ప్రతిపక్ష నేత కాదు..ఆ హోదాకు తగిన సంఖ్యా బలం వైసీపీ పార్టీకి లేదనేది జగమెరిగిన సత్యం. కానీ, అది జగన్‌కు తెలియకపోవడమే బాధాకరం. చట్టాలు, రూల్స్‌ జగన్‌ తెలుసుకోవాలి. చట్టాలు, నిబంధనలు మార్చి జగన్‌కు సమయం ఇవ్వలేం కదా అని దుయ్యబట్టారు.

జగన్‌కు ప్రతిపక్ష హోదా కావాలంటే 18 మంది ఎమ్మెల్యేలు కావాలి..ఆయనకు వచ్చింది 11 సీట్లు అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్‌లో కూర్చొని మాట్లాడితే.. ప్రభుత్వం, మంత్రులు అసెంబ్లీలో సమాధానం చెప్పాలని వైసీపీ నేతలు అనడం వింతగా ఉందని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవచ్చు. ఫలానా కారణం వల్ల సభకు రాలేకపోతున్నానని స్పీకర్‌కు లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. సభ్యుల లేఖలో సహేతుక కారణం ఉంటే స్పీకర్‌ అనుమతి ఇస్తారు. సభకు రాని సభ్యులు వ్యక్తిగతంగా లేఖలు ఇవ్వాల్సి ఉంటుంది. వైసీపీలో మిగతా ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం జగన్‌ ఇవ్వాలి. వారి వారి నియోజకవర్గాల సమస్యలను చెప్పుకొనే అవకాశం కల్పించాలి. సభకు వచ్చి సమస్యలపై మాట్లాడాలని జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలను కోరుతున్నా. అసెంబ్లీ హాజరు జాబితాలో నకిలీ సంతకాలు పెట్టేందుకు కుదరదు అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

Next Story