ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 15న ఉదయం 9 గంటలకు శాసన సభ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా.. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది.
ఈ సమావేశాల్లో గత మూడున్నరేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రధానంగా చర్చ చేపట్టాలని ప్రభుత్వం బావిస్తోంది. పోలవరం – పునారావాస ప్యాకేజీ పైన సభలోనే చర్చించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు మరోసారి సభ ముందుకు వస్తుందని ప్రచారం సాగుతోంది. న్యాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్న తరువాతనే బిల్లును సభలో ప్రవేశపెట్టాలని పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు అధికార పక్షాన్ని ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సిద్దం అవుతున్నాయి.