ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
AP Assembly session start TDP continues protest.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభం అయ్యాయి.
By తోట వంశీ కుమార్ Published on 15 Sept 2022 10:56 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభం అయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే సభలో గందరగోళం నెలకొంది. నిరుద్యోగ సమస్యపై వాయిదా తీర్మానం చేపట్టాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. యువత ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ప్రశ్నోత్తరాల తరువాత చర్చిద్దామని స్పీకర్ తెలిపినా టీడీపీ సభ్యులు మాట వినలేదు.
దీంతో టీడీపీ సభ్యుల తీరును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పుబట్టారు. కావాలనే రచ్చ చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. సభలోకి ఫ్లకార్డులు తీసుకురావడం సరికాదని అన్నారు. అసెంబ్లీ నిర్వహించాలని డిమాండ్ చేసిన టీడీపీ సభ్యులే ఇప్పుడు సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సభా సమయాన్ని వృథా చేస్తున్నారని, ప్రశ్నోత్తరాలు జరగకుండా అడ్డుకుంటోందని అన్నారు. టీడీపీ వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.
గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం 2లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిందన్నారు. అసెంబ్లీ పెట్టాలని టీడీపీ నేతలు సవాలు చేశారని, కానీ.. ఇప్పుడు సమావేశాలను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు సభ సమయాన్ని వృథా చేస్తున్నారన్నారు. ప్రజాసమస్యలపై చర్చించడం టీడీపీ కి ఇష్టం లేదని అన్నారు.
టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారని జోగి రమేష్ అన్నారు. టీడీపీ సభ్యులకు చర్చించే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే సభను అడ్డుకుంటున్నారన్నారు. సుధాకర్ బాబు మాట్లాడుతూ.. టీడీపీకి నైతిక హక్కు లేదని, ప్రజా సమస్యలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. చంద్రబాబు ఎలా ఉన్నారో ఆ పార్టీ నాయకులు కూడా అలాగే ఉన్నారని చెప్పుకొచ్చారు.