Andhra Pradesh: అసైన్డ్ భూముల సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ గురువారం 'ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల (బదలాయింపు నిషేధం) (సవరణ) బిల్లు-2026' ను ఆమోదించింది.
By - అంజి |
Andhra Pradesh: అసైన్డ్ భూముల సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ గురువారం 'ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల (బదలాయింపు నిషేధం) (సవరణ) బిల్లు-2026' ను ఆమోదించింది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల స్థాపనకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను సులభతరం చేయడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం.
గతంలో 1977 నాటి చట్టం ప్రకారం.. భూమి లేని పేదలకు సాగు కోసం కేటాయించిన అసైన్డ్ భూములను విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం నిషిద్ధం. అయితే, తాజా సవరణ ద్వారా ప్రభుత్వం ఈ భూములను దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన సేకరించి, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఉపయోగించుకోనుంది.
10,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు: రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఈ భూములను 'ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్' (గతంలో ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్)కు లీజుకు ఇచ్చేందుకు వీలు కల్పించింది. ఈ భూములను వ్యవసాయేతర అవసరాలకు కూడా వాడుకోవచ్చు.
ఏపీ సమీకృత క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 ద్వారా 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచాలని, తద్వారా ₹10,00,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో జారీ చేసిన 2025 ఆర్డినెన్స్ స్థానంలో ఈ కొత్త సవరణ బిల్లును రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో ప్రవేశపెట్టారు. దీనితో పాటు, 'ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల (సవరణ) బిల్లు-2026' కు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 'స్వర్ణాంధ్ర', 'వికసిత్ భారత్-2047' లక్ష్యాల సాధనలో భాగంగా సచివాలయ సిబ్బంది బాధ్యతలు, విధులను పునర్వ్యవస్థీకరించేందుకు ఈ సవరణ చేశారు.