విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని భావిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని పార్టీలు అందుకు ఒప్పుకోవడం లేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తూ ఉన్నారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసింది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారని చెప్పారు. ఈ తీర్మానానికి ఆమోదముద్ర పడిన వెంటనే సభ నిరవధికంగా వాయిదా పడింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ రూ.2,29,779.27 కోట్లు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి, వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్ రూ.31,256.36 కోట్లు. టీడీపీ చెప్పినట్టుగానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి హాజరు కాలేదు.