ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ రోజు స్పీకర్ తమ్మినేని సీతారాం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిన్న పంట నష్టానికి సంబంధించిన అంశం మీద ప్రభుత్వం మీద ఫైర్ అయిన టీడీపీ.. నేడు టిడ్కో ఇళ్లకు సంబంధించిన అంశాల మీద అసెంబ్లీలో విమర్శలు గుప్పించింది.
ఇదే అంశం మీద స్పీకర్ వైపు వేలెత్తి చూపిస్తూ చంద్రబాబు మాట్లాడారు. తాము మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదంటూ బాబు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో స్పీకర్ అసహనం, ఆగ్రహాం వ్యక్తం చేశారు. మాట్లాడే పద్దతి నేర్చుకోవాలంటూ చంద్రబాబుకు స్పీకర్ హితవు పలికారు. సభను విపక్షం పదే పదే అడ్డుకోవడం సబబు కాదన్నారు. సభాధ్యక్షుడినే బెదిరిస్తారా..? మీ శాపనార్థాలకు, బెదిరింపులకు ఎవరూ భయపడది లేదంటూ.. స్పీకర్ తమ్మినేని చంద్రబాబు మీద తీవ్రంగా ఫైరయ్యారు. మీరు మాట్లాడేందుకు ఇంతకముందు అవకాశాలు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా అవకాశం ఇస్తామన్నారు. శాసనసభలో నిలబడితే.. అద్దం ముందు నిలబడినట్టేనని సభలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. మీ దగ్గర నీతులు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు.